Fake News, Telugu
 

భారతదేశం దాడిలో ధ్వంసమైన పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ (చక్‌లాలా) ఎయిర్‌బేస్‌ దృశ్యాలంటూ సూడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదిరిందని భారత ప్రభుత్వం 10 మే 2025న ప్రకటించింది (ఇక్కడఇక్కడఇక్కడ). పాకిస్తాన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌కు 10వ తేదీన 3:35 గంటలకు ఫోన్ చేశారని, ఇరువైపుల జరుగుతున్న కాల్పులు భారతీయ కాలమానం ప్రకారం 10 మే 5:00 గంటలకు విరమించుకోవాలని వారిరువురూ ఒక ఒప్పందానికి వచ్చారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. అయితే, దీన్ని ఉల్లంఘిస్తూ సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాకిస్థాన్ భారత్‌పై కాల్పులు జరిపిందని భారత ప్రభుత్వం తెలిపింది (ఇక్కడఇక్కడ). భారతీయ సాయుధ దళాలు ఈ ఉల్లంఘనకు తగిన జవాబు ఇస్తున్నారని విక్రమ్ మిశ్రి ప్రకటించారు

11 మే 2025న భారత త్రివిధ దళాల అధికారుల ‘ప్రెస్‌ మీట్‌’ నిర్వహించి, ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు (ఇక్కడ). ఈ మీడియా సమావేశంలో భారత ఆర్మీ డీజీఎంఓ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్ పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో పాకిస్థాన్‌ భూభాగంపై భారత దళాలు చేసిన దాడులకు సంబంధించిన వివరాలను వీడియోలు, షాటిలైట్‌ చిత్రాలతో సహా వెల్లడించారు. ఈ సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి మాట్లాడుతూ, భారత వైమానిక దళం బహవల్పూర్, మురుద్కే ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించిందని అన్నారు. దాడులకు ముందు ఆ తర్వాత ఘటనాస్థలి దృశ్యాలను ఏకే భారతి తెరపై ప్రదర్శిస్తూ ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. పాకిస్తాన్ డ్రోన్లతో భారతదేశంపై దాడి చేసిందని, అయితే  భారతదేశం వాటిని ఆవలే ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ దాడులకు ప్రతి చర్యగా లాహోర్‌, గుజ్రన్‌వాలా, సర్‌గోదా, రహీర్‌యార్‌ఖాన్‌, చక్‌లాలా (నూర్ ఖాన్), సకర్, భొలారీ, జకోబాబాద్‌ ఎయిర్‌బేస్‌లను, రాడార్ సెంటర్లను భారత్ ధ్వంసం చేసిందని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో, “భారతదేశం దాడిలో ధ్వంసమైన పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ (చక్‌లాలా) ఎయిర్ బేస్ దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇస్లామాబాద్ నుండి సుమారు 10 కి.మీ దూరంలో రావల్పిండి ప్రాంతంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ను గతంలో చక్‌లాలా ఎయిర్‌బేస్‌గా పిలిచేవారు (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశం దాడిలో ధ్వంసమైన పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ (చక్‌లాలా) ఎయిర్‌బేస్‌ దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా లాహోర్‌, గుజ్రన్‌వాలా, సర్‌గోదా, రహీర్‌యార్‌ఖాన్‌, చక్‌లాలా (నూర్ ఖాన్), సకర్, భొలారీ, జకోబాబాద్‌ ఎయిర్‌బేస్‌లను, రాడార్ సెంటర్లను భారత్ ధ్వంసం చేసిందని భారత దళాలు స్పష్టం చేశాయి, అలాగే దాడులకు ముందు, ఆ తర్వాత ఘటనాస్థలి దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. కానీ, ఈ వైరల్ వీడియోకు పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ వీడియోలోని దృశ్యాలు సూడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినవి. మే 2023లో సూడాన్ సైన్యంకు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన ఘర్షణలలో ఈ విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో విమానాలు ధ్వంసమయ్యాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో చాలా వరకు ప్రయాణికులను చేరవేసే విమానాలు కనిపిస్తున్నాయి, ఎక్కడ ఫైటర్ జెట్లు (యుద్ధ విమానాలు) కనిపించవు.అలాగే, టైంస్టాంప్ 00:52 వద్ద పలు విమానాల తోక భాగాలపై ‘SUDAN’ అని రాసి ఉండటం మనం చూడవచ్చు.

తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘africanaviators_official’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ 31 మార్చి 2025న అప్లోడ్ చేసినట్లు గుర్తించాము. “మే 2023లో సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన ఘర్షణల సమయంలో పెద్ద సంఖ్యలో విమానాలు ధ్వంసమైన సుడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KRT/HSSK) యొక్క విచారకరమైన దృశ్యాలు, సుడాన్ సైన్యం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది” అని ఈ వీడియో వివరణలో పేర్కొన్నారు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో సూడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.

ఈ వెతికే క్రమంలోనే, ఇవే దృశ్యాలను కలిగిన అధిక నిడివి గల వీడియోను ఏప్రిల్ 2025 మొదటి వారంలో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ) (ఆర్కైవ్డ్ ఇక్కడ) . వారు కూడా ఈ వైరల్ వీడియో సూడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. ఈ అధిక నిడివి గల వీడియోలో టైంస్టాంప్ 04:32 వద్ద ‘Blue Bird Aviation CO LTD’ అని ఓ విమాన హ్యాంగర్‌పై రాసి ఉండటం మనం చూడవచ్చు. ‘బ్లూ బర్డ్ ఏవియేషన్’ కంపెనీ అనేది సూడాన్‌కు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్). ఈ సమాచారం ఆధారంగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు సూడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినవని మనం నిర్ధారించవచ్చు.

రిపోర్ట్స్ ప్రకారం, దాదపు రెండు సంవత్సరాల తర్వాత, ఇటీవలే మార్చి 2025లో సుడాన్ సైన్యం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, భారత దాడిలో ధ్వంసమైన పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ (చక్‌లాలా) ఎయిర్‌బేస్‌ దృశ్యాలంటూ సూడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll