తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క 19 మార్చి 2025న తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంచనా విలువ రూ. 3,04,965 కోట్లు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, “మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26ను విమర్శిస్తూ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను విమర్శిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో తెలంగాణ బడ్జెట్ 2024-25ను విమర్శిస్తూ 25 జూలై 2024న తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశాన్ని చూపిస్తుంది. ఈ కథనం రాసే సమయానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై కేసీఆర్ స్పందించినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26ను విమర్శిస్తూ మీడియా సమావేశం నిర్వహించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ కథనం రాసే సమయానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై కేసీఆర్ స్పందించినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించి చేసి ఉంటే, కచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి. హరీష్ రావు, కేటీఆర్ వంటి పలువురు బీఆర్ఎస్ అగ్ర నేతలు తెలంగాణ బడ్జెట్ 2025-26 పై స్పందించినట్లు పలు రిపోర్ట్స్ ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో తెలుగు మీడియా సంస్థ ‘సాక్షి టీవీ’ లోగో ఉండటం మనం చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్‌లో వెతకగా, ఇదే వీడియో (ఆర్కైవ్డ్) 25 జూలై 2024న సాక్షి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అయినట్లు కనుగొన్నాము. ఈ వీడియోను “కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గట్టి కౌంటర్ | తెలంగాణ బడ్జెట్ 2024-25 |” (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2024-25 పై స్పందిస్తూ, 25 జూలై 2024న తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశాన్ని చూపిస్తుంది. దీన్ని బట్టి ఈ వీడియో తెలంగాణ బడ్జెట్ 2024-25 పై కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించింది అని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, 2025 తెలంగాణ బడ్జెట్‌ను కేసీఆర్ విమర్శిస్తున్న దృశ్యాలు అంటూ జూలై 2024లో 2024 తెలంగాణ బడ్జెట్‌ను కేసీఆర్ విమర్శిస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు.