బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ప్రాంతంలో ఒక హిందూ మహిళపై కొందరు ముస్లిం వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆమె నాలుకను కోసివేశారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో గాయపడిన ఒక మహిళ నేలపైన కూర్చొని ఉండడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ముస్లిం వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆమె నాలుకని కోసివేసిన ఘటనకు సంబంధించిన వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో పశ్చిమ బెంగాల్లోని జాయ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటనకి సంబంధించినది. 21 జనవరి 2025న లతీఫా ఖాతూన్ అనే మహిళని వ్యక్తిగత కారణాలతో గియాసుద్దీన్ గాజి అనే వ్యక్తి హత్య చేసినట్లు బకుల్తల పోలీసులు కేసు నమోదు చేసి గాజీని అరెస్టు చేశారు. ఇద్దరూ ముస్లిం మతానికి చెందినవారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోని పరిశీలించగా తాను ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్) ప్రాంతం నుంచి వచ్చినట్లు ఆమె బంగ్లా భాషలో చెప్పడం గమనించాం. దీని ఆధారంలో ఇంటర్నెట్లో వెతకగా, 24 జనవరి 2025న ప్రసారం చేయబడ్డ ఇవే దృశ్యాలు కలిగిన వార్తా కథనం లభించింది. పశ్చిమ బెంగాల్లోని బకుల్తల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాయ్ నగర్ ప్రాంతంలో ఒక పొలం వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించిందని, పోలీసులు ఈ కేసుని దర్యాపు చేస్తున్నారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు వెతకగా, దీనికి సంబంధించిన అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 21 జనవరి 2025న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందిన లతీఫా ఖాతూన్ అని మహిళ గాయాలతో బకుల్తల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాయ్ నగర్ ప్రాంతంలో పొలం వద్ద పడి ఉండడం కొందరు స్థానికులు గుర్తించారు. అయితే ఆమెని ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసు విచారణలో ఆమెని హత్య చేసింది గియాసుద్దీన్ గాజి అనే వ్యక్తి అని తేలడంలో 28 జనవరి 2025న గాజిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాజిపై హత్య కేసు నమోదు చేసి స్థానిక కోర్టులో (CNR No. WBSP0C0007082025) హాజరుపరిచారు.

బకుల్తల పోలీసులు కూడా ఈ వైరల్ వీడియో ఈ కేసు సంబంధించినదిగా నిర్ధారించారు. ఈ ఘటన పశ్చిన బెంగాల్లోని బకుల్తల ప్రాంతంలో జరిగిందని, వ్యక్తిగత కారణాలతో లతీఫాని గాజి అనే వ్యక్తి హత్యచేశాడని, ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని బకుల్తల పోలీసులు ఫ్యాక్ట్లీతో చెప్పారు.
చివరిగా, బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై దాడి జరిగిందంటూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వీడియోని షేర్ చేస్తున్నారు.