“కర్ణాటకలో పోలీసులపై ముస్లింల దాడి, జీపుల్లో ప్రయాణిస్తున్న వారికి సరైన పత్రాలు లేవని పోలీసులు చట్టబద్ధంగా చలాన్ జారీ చేసినందుకు ముస్లింలు వారిని కొట్టారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఓ పోలీసును ఒక మహిళ చెప్పుతో కొడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో చలాన్ జారీ చేసినందుకు ముస్లింలు పోలీసులను కొడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో కర్ణాటకకు సంబంధించినది కాదు. ఇది ఆగస్టు 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరామ్ నగర్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలుపల ఒక మహిళ, ఆమె సహచరులు ఓ పోలీసుపై చెప్పుతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, పోలీసులపై దాడి చేసిన మహిళ, ఇతర నిందితులు అందరూ ముస్లిం మతానికి చెందినవారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది .
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ఆగస్టు 2018లో ప్రచురితమైన ‘పత్రిక’ వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం ఈ ఘటన ఆగస్టు 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని లోనీ బోర్డర్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వెలుపల జరిగింది.

దీని ఆధారంగా, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, 27 ఆగస్టు 2018న ప్రచురితమైన ‘జాగ్రన్’ వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరామ్ నగర్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలుపల ఒక మహిళ, ఆమె సహచరులు ఓ పోలీసుపై చెప్పుతో దాడి చేశారు. అశోక్ విహార్ కాలనీలో నివసించే ఇమ్రాన్ అనే వ్యక్తి బ్యాంకు పని నిమిత్తం బలరామ్ నగర్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్ళగా, అక్కడ అతనికి, బ్యాంకు సిబ్బందితో వాగ్వాదం జరిగగా, బ్యాంకు భద్రతా సిబ్బంది అతన్ని బయటకు తోసేశారు. దాంతో అతను తన బంధువులు, స్నేహితులకు చెప్పాడు. బ్యాంకు ఉద్యోగులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అక్కడి నుండి వెళ్లిపోవాలని కోరగా, ఇమ్రాన్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో పోలీసులకు ఇమ్రాన్ మధ్య తోపులాట జరిగింది, ఈ తోపులాటలో ఓ పోలీసు ఇమ్రామ్ పై చేయి చేసుకున్నాడు. అప్పుడు అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులపై దాడి చేశారు, ఈ దాడిలో ఇమ్రాన్ సోదరి, కానిస్టేబుల్ అనూప్ కుమార్ ను చెప్పుతో పలుమార్లు కొట్టింది. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ సంఘటనను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అశోక్ విహార్ కాలనీ నివాసితులు అయిన ఇమ్రాన్, రషీద్, మో, ఇజ్రాయెల్, ఫైమ్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 2018లో ప్రచురితమైన ‘నవ భారత్’ కథనం ప్రకారం, ఈ దాడికి సంబంధించి 27 ఆగస్టు 2018న ఘజియాబాద్ ఎస్‌ఎస్‌పి (SSP) వైభవ్ కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు (ఆర్కైవ్డ్ లింక్). ఆయన కూడా వార్త కథనాలు పేర్కొన్న విషయాలనే తెలియజేశారు.
చివరగా, కర్ణాటకలో చలాన్ జారీ చేసినందుకు ముస్లింలు పోలీసులను కొడుతున్న దృశ్యాలు అంటూ 2018లో ఉత్తరప్రదేశ్‌లో పోలీసులపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు.