ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 13 జనవరి 2025లో ప్రారంభమైన మహా కుంభమేళాలో మూడు తలలు ఏనుగు కనిపించిందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళాలో కనిపించిన మూడు తలల ఏనుగు.
ఫాక్ట్: ఈ వీడియో 2025 మహా కుంభమేళాకు చెందినది కాదు. మే 2024 నుంచి షేర్ చేయబడుతున్న ఈ వీడియో థాయిలాండ్‌లో జరిగే అయుతయ ఖోన్ ఉత్సవాలకి చెందినది. ఇందులో ఏనుగు తలకి రెండు వైపులా కృత్రిమ తలలు ఏర్పాటు చేస్తారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని 31 మే 2024లో ఒక థాయిలాండ్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసి ఉండడం గుర్తించాం. దీని ప్రకారం, ఈ వీడియో (ఆర్కైవ్) థాయిలాండ్‌లోని అయుతయ సంస్కృతిని తెలియజేసే ‘అయుతయ ఖోన్ ఉత్సవం’ కోసం చేస్తున్న సన్నాహాలను చూపుతుంది. ఈ వీడియోలో మావటి స్వారీ చేస్తున్న ఏనుగుకి అదనంగా రెండు కృత్రిమ తలలు అమర్చినట్లు చూడవచ్చు.

దీని గురించి మరింత పరిశోధించగా, గతంలో థాయిలాండ్‌లో నిర్వహించిన అయుతయ ఖోన్ ఉత్సవంలో ఇలాంటి మూడు తలల ఏనుగు ఊరేగింపుని చూపే మరిన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. ఈ వీడియోల్లో ఏనుగు తలకి రెండు వైపులా కృత్రిమ తలలు ఉండడం చూడవచ్చు.

అయుతయ సంస్కృతిలో భాగంగా ప్రతియేటా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అయుతయ రాజ్యాన్ని ప్రస్తుత థాయిలాండ్‌కు పూర్వగామిగా భావిస్తారు. థాయ్ పురాణాలలో, ఎరావాన్ (ఐరావతానికి థాయ్ పేరు) అనేక దంతాలు కలిగిన మూడు లేదా కొన్నిసార్లు ముప్పై మూడు తలలు కలిగిన భారీ ఏనుగుగా పేర్కొనబడింది. థాయిలాండ్‌లోని అనేక దేవాలయాలలో ఇంద్రుడు మూడు తలల ఏనుగు ఎరావాన్‌పై స్వారీ చేస్తున్న శిల్పాలు ఉన్నాయి. థాయిలాండ్‌లో ఒక ప్రత్యేక ఎరావాన్ మ్యూజియం కూడా ఉంది.
గతంలో కూడా ఇదే వీడియో నిజమైన మూడు తలల ఏనుగు అని సోషల్ మీడియాలో ప్రచారం అయినప్పుడు దాన్ని తప్పుగా నిరూపిస్తూ ఫ్యాక్ట్లీ రాసిన ఫాక్ట్- చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. పై ఆధారాలని బట్టి, వైరల్ వీడియో 2025 మహా కుంభమేళాకి చెందినది కాదని స్పష్టమవుతుంది.
చివరిగా, 2025 మహా కుంభమేళాకు మూడు తలల ఏనుగు వచ్చిందని థాయిలాండ్‌కు చెందిన వీడియోని షేర్ చేస్తున్నారు.