బురఖా ధరించిన ఒక రోహింగ్యా ముస్లిం వ్యక్తి, ఒక హిందూ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడని చెప్తూ, ఈ వీడియోని సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఈ వీడియోలో కనిపిస్తున్న రోహింగ్యా వ్యక్తి, బురఖా ధరించి ఒక హిందూ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్లి పట్టుబడ్డాడు.
ఫ్యాక్ట్ (నిజం): 23 జూలై 2025న బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని షల్‌బాగన్ చెక్‌పోస్ట్ దగ్గర, తనిఖీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న రషీద్ అహ్మద్ అనే 27 ఏళ్ల రోహింగ్యా వ్యక్తిని ఈ వీడియో చూపిస్తుంది. అతను కాక్స్ బజార్‌లోని రోహింగ్యా క్యాంప్ నంబర్ 26కు చెందిన వ్యక్తి. నేర కార్యకలాపాల కోసం అతను రహస్యంగా క్యాంప్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని బంగ్లాదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి, ఈ పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లు ఉన్న, 24 జూలై 2025 నాటి అనేక బంగ్లాదేశీ మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.

ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 23 జూలై 2025న బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ నగరంలో జరిగింది. వీడియోలో బురఖా ధరించి కనిపించిన వ్యక్తిని 27 ఏళ్ల రషీద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు, అతన్ని కాక్స్ బజార్‌లోని టెక్నాఫ్ ప్రాంతంలోని షల్‌బాగన్ చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రషీద్ రోహింగ్యా క్యాంప్ నెంబర్ 26 నివాసి ఫరీద్ అహ్మద్ కుమారుడు.
టెక్నాఫ్ మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ గియాసుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, రషీద్ సాధారణ పోలీస్ తనిఖీలో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. అతని ప్రవర్తన, దుస్తులు, మాట్లాడే విధానం అనుమానాన్ని రేకెత్తించగా, పోలీసులు అతన్ని ఆపి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతను ఏదో నేరపూరిత కార్యకలాపాలు చేయడానికి రహస్యంగా క్యాంప్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిమిత్తం ప్రస్తుతం చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయి. అతను ఒక హిందూ ఇంటి నుంచి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాని ఈ కథనాల్లో ఎక్కడా పేర్కొనలేదు.

చివరగా, బంగ్లాదేశ్‌లో బురఖా ధరించి ఒక రోహింగ్యా ముస్లిం ఒక క్యాంపులోకి వెళ్తూ పట్టుబడిన వీడియోని షేర్ చేస్తూ, ఒక హిందూ ఇంటి నుంచి దొంగతనం చేస్తూ ఒక రోహింగ్యా ముస్లిం పట్టుబడ్డాడని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.