‘తమిళనాడు ఎయిర్పోర్టులో కారు ఎక్కుమని బలవంతంగా ప్రయాణికుల చేతులు పట్టుకొని మరి లాక్కెళ్తున్న క్యాబ్ డ్రైవర్స్… క్యాబ్ డ్రైవర్స్ కి సపోర్ట్ చేస్తున్న అక్కడి పోలీసు’ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. ఇందులో ఒక మహిళ ఒక పోలీసుతో వాగ్వాదం పెట్టుకుంటున్నట్లు కనిపిస్తున్న స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయి. తన చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్లినందుకు క్యాబ్ డ్రైవర్ చెంప చెల్లుమనిపించి, అతన్ని సపోర్ట్ చేసిన పోలీసుతో ఆమె వాగ్వాదం పెట్టుకుందని, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఈ పోస్ట్ యొక్క వివరణలో చెప్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టీకల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడులోని క్యాబ్ డ్రైవర్లు విమానాశ్రయంలో ప్రయాణికులను బలవంతంగా టాక్సీలలోకి లాక్కొని వెళ్తున్న దృశ్యాలు.
ఫ్యాక్ట్ (నిజం): మే 2025లో కోయంబత్తూరు విమానాశ్రయంలో జరిగిన ఒక వ్యక్తిగత గొడవను ఈ వీడియో చూపిస్తుంది. వార్తా కథనాలు, తమిళనాడు ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వారి ప్రకారం, ఒక మహిళకు, తన ప్రియుడికి మధ్య జరిగిన ఒక గొడవను ఈ వీడియో చూపిస్తుంది. అంతే కానీ, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను వేధిస్తున్న దృశ్యాలను కాదు. కాబట్టి, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, పోస్టులో ఉన్న స్క్రీన్‌షాట్‌లను ఉపయోగించి మేము గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు 27 మార్చి 2025న అప్‌లోడ్ చేసిన, ఈ స్క్రీన్‌షాట్‌లలోని దృశ్యాలున్న వీడియో మాకు లభించింది. ‘ “నన్ను వివాహం చేసుకున్న తర్వాత, అతను ఆమెతో హనీమూన్‌కు వెళ్ళాడు” … నూతన వధూవరులను వేధిస్తున్న స్త్రీ: కోయంబత్తూరు విమానాశ్రయంలో గందరగోళం.’అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వారు ‘X’లో పోస్ట్ చేశారు.
వైరల్ వీడియో క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను వేధిస్తున్న దృశ్యాలను కాకుండా, ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఒక వ్యక్తిగత వివాదాన్ని చూపిస్తుందని మనకు దీనిబట్టి అర్థం అవుతుంది. మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనను కవర్ చేసే అనేక మీడియా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం, 26 మే 2025న ఒక చెన్నై-కోయంబత్తూర్ విమానం, కోయంబత్తూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత గందరగోళం నెలకొంది. ఒక మహిళ ఒక వ్యక్తిని అడ్డగిస్తూ, అతను తనను వివాహం చేసుకుని, ఆ తర్వాత మరొక మహిళతో హనీమూన్‌కు వెళ్లాడని ఆరోపించింది. ఆమె ప్రయాణికుల ముందు బహిరంగంగా అతనిని దూషించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న నీలిరంగు చొక్కాలో ఉన్న వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. వార్తా కథానాల ప్రకారం, ఆ మహిళ వాదనలు, ఆ వ్యక్తితో ఆమెకు ఉన్న సంబంధంపై పీలమేడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అదనంగా, ఈ క్లెయిమ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, తమిళనాడు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ TN ఫ్యాక్ట్ చెక్, 16 ఆగస్టు 2025న ఈ సంఘటన గురించి ‘X’ ద్వారా ఒక వివరణ ఇచ్చింది. ఈ వీడియో వాస్తవానికి ఒక వ్యక్తిగత వివాదాన్ని చూపిస్తుందని, క్యాబ్ డ్రైవర్లకు దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు ఇందులో పేర్కొన్నారు. తమిళనాడు విమానాశ్రయాలలో టాక్సీ డ్రైవర్లు ప్రయాణికులను వేధిస్తున్నారనే తప్పుడు వాదనతో ఈ క్లిప్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారని వారు స్పష్టం చేశారు.
చివరగా, కోయంబత్తూరు విమానాశ్రయంలో జరిగిన ఒక వ్యక్తిగత గొడవకు సంబంధించిన వీడియోను, తమిళనాడులోని క్యాబ్ డ్రైవర్లు, విమానాశ్రయంలో ప్రయాణికులను బలవంతంగా టాక్సీలలోకి ఈడ్చుకుంటూ వెళుతున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.