Fake News, Telugu
 

శ్రీలంకలో జరిగిన ఆటల పోటీల వీడియోని కేరళలో జరిగినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

అమ్మాయిల చేతుల కింద ఉన్న బాటిల్ నుండి అబ్బాయిలు నీళ్లు తాగే పోటీ యొక్క వీడియోని సోషల్ మీడియాలో కేరళలోని ఒక స్కూల్లో జరిగిన సంఘటన అని షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాము. 

క్లెయిమ్:  వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, కేరళలోని ఒక స్కూల్లో నిర్వహించిన పోటీకి సంబంధించినవి. 

ఫాక్ట్(నిజం): ఈ పోటీ కేరళలో జరగలేదు, శ్రీలంకలో జరిగింది. వీడియోకి సంబంధించిన వివరాల కోసం, ఫాక్ట్ చెకింగ్ సంస్థ , ఫాక్ట్ క్రెసెండో శ్రీలంకను మేము సంప్రదించగా, వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాతో షేర్ చేసారు. అందులో జనాలు మాట్లాడుతున్న భాష, వెనుక వస్తున్న పాటను బట్టి ఇది సిన్హల భాష అని నిర్ధారించి చెప్పారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే లాగా ఉంది. 

మొదటిగా కేరళలోని ఏదైనా స్కూల్లో ఇలాంటి పోటీ నిర్వహించినట్లు వార్తా కథనాలు ఏమైనా ఇంటర్నెట్లో ఉన్నాయా అని వెతకగా, అటువంటి సమాచారమేది దొరకలేదు. వీడియోలో ఒక అమ్మాయి వేసుకొన్న బ్లూ అండ్ వైట్ రంగు టీ-షర్ట్ పైన ఉన్న అక్షరాలను క్షుణ్ణంగా చూడగా, అవి శ్రీలంక దేశంలో వాడుకలో ఉన్న సిన్హల భాష యొక్క లిపిని పోలి ఉన్నట్లు అనిపించింది.  దీన్ని గుర్తుగా తీస్కొని, ఫాక్ట్ చెకింగ్ సంస్థ ఫాక్ట్ క్రెసెండో శ్రీలంకను మేము ఈ వీడియో గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాము. వాళ్ళు ఆ టీ షర్ట్ పైన ఉన్న అక్షరాలు సిన్హల భాషవే అని, ఆ పదం( සංගමය- సిన్హలలో ) యొక్క ఆంగ్ల అర్థం ‘ అసోసియేషన్ ’ అని చెప్పారు. 

ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాతో షేర్ చేస్తూ, అందులో వస్తున్న పాట, మనుషులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి వాళ్ళు శ్రీలంకకు చెందిన వారని చెప్పారు. ఇదే వీడియోను పలు శ్రీలంక డిజిటల్ మీడియా సంస్థలు కూడా వారి యూట్యూబ్ ఛానళ్లలో అప్లోడ్ చేసాయి. వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

అంతే కాక, వీడియోలో కనిపిస్తున్న ఒక ఆటో ఎరుపు రంగులో ఉంది. కేరళ రాష్ట్రంలో ఉన్న ఆటోలకు ఎరుపు రంగు పెయింటు వేసే అనుమతి అధికారికంగా లేదు.

 “THE KERALA MOTOR VEHICLES RULES, 1989 ”లోని 295వ రూలుని బట్టి, క్రీం ఎల్లో మరియు నలుపు రంగు పెయింటు ఆటోలకి చెయ్యాలి. కొన్ని ప్రత్యేక ఆటోలకి (మహిళలు నడిపే ఆటోలు లేదా CNG ఆటోలు) వేరే రంగులను వారు నిర్దేశించారు. వీటిల్లో ఎరుపు రంగు లేదు (ఇది చదవండి).  

ఇదిలా ఉంచితే, శ్రీలంకలో తమిళ మరియు సిన్హల నూతన సంవత్సర వేడుకల సమయంలో ఆటల పోటీలు నిర్వహించబడతాయి, ఇది అక్కడి ఆచారం (ఇక్కడ, ఇక్కడ). గతంలో కూడా వైరల్ వీడియోలో ఆడుతున్న ఆటల పోటీని పోలిన ఆట, సిన్హల నూతన సంవత్సర (Aluth Avurudda) వేడుకల సందర్భంగా నిర్వహించారు. వాటికి  సంబందించిన సమాచారం మీరు ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు.

శ్రీలంక యొక్క సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధంగా, కొంతమంది ఈ ఆటల్ని నిర్వహిస్తున్నందున, భవిషత్తులో జరిగే ఈ పోటీలని ప్రభుత్వం నియంత్రిస్తుంది అని శ్రీలంక ‘Minister of Buddhasasana, Religious and Cultural Affairs’ ‘విదుర విక్రయమనాయకే’ ఏప్రిల్ 2023లో అన్నట్టు అక్కడి స్థానిక పత్రికలు రిపోర్ట్ చేసాయి. 

చివరిగా, శ్రీలంకలో జరిగిన ఆటల పోటీల వీడియోని కేరళలో జరిగిన పోటీ దృశ్యాలని తప్పుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll