Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రెండు ముస్లిం కుటుంబాల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు

0

“ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లింలు హిందువులపై దాడి చేశారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో మనం కొందరు ఓ ఇంటిపై దాడి చేసి, ఆ ఇంటిలోని వ్యక్తులను బయటికి లాగి వారిపై దాడి చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అలాగే, ఇదే వీడియోను షేర్ చేస్తూ, ఈ వీడియో నిజంగా హిందువులపై ముస్లింల దాడిని చూపిస్తుందా? లేదా? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లింలు హిందువులపై దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాలో గల లోనీ బోర్డర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్‌ స్ట్రీట్ నంబర్ 14లో 25 ఫిబ్రవరి 2025న జరిగిన సంఘటనకు సంబంధించినది. పోలీసుల ప్రకటన, FIR ప్రకారం, ఈ దాడి ఘటనలో నిందుతులు, బాధితులు ఇరువురు ముస్లింలే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 28 ఫిబ్రవరి 2025న ‘న్యూస్ 24 (NEWS 24)’ మీడియా సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ సంఘటన 25 ఫిబ్రవరి 2025న ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాలో గల లోనీ బోర్డర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్‌ స్ట్రీట్ నంబర్ 14లో జరిగింది. ఘజియాబాద్‌లోని లోనీ బోర్డర్ ప్రాంతంలో, బుల్లెట్ మోటార్‌సైకిల్ యొక్క “మోడిఫైడ్ సైలెన్సర్” నుండి పెద్ద శబ్దాలు రావడంతో ఒక బైకర్‌ను ఓ వ్యక్తి, అతని  కుటుంబం అడ్డగించారని, దీనితో  సదరు బైకర్ ఆ  కుటుంబంపై కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి దాడి చేశాడని పేర్కొంటూ ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయని పేర్కొంది. అయితే, ఈ దాడి పాత ఆర్థిక వివాదం కారణంగా బంధువులైన రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదమని పోలీసులు తరువాత స్పష్టం చేశారు అని ఈ కథనం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ఈ సమాచారం ఆధారంగా మేము ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి లోనీ బోర్డర్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడిన FIR కాపీని మేము పరిశీలించాము. FIR ప్రకారం, అయూబ్ పైల్వాన్, అతని కుటుంబ సభ్యులు తన బంధువు సాద్ బైకుపై వెళ్తుండగా అతని అడ్డగించి, వారి ఇంట్లో బంధించి దాడి చేశారు. అతని బంధించిన విషయం తెలుసుకున్న ఇర్షాద్, అతని కుటుంబ సభ్యులు, మరికొందరు అయూబ్ పైల్వాన్ ఇంటికి వెళ్లి సాద్‌ను రక్షించడానికి ప్రయత్నించగా, అయూబ్ పైల్వాన్, అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ఇర్షాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ దాడి ఘటనలో నిందుతులు రిజ్వాన్, అర్మాన్, అయూబ్ పైల్వాన్, అతని భార్య అఫ్సాన్ ఖాటూన్‌గా FIRలో పేర్కొన్నారు. ఈ ఘటనలో నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

తదుపరి ఈ సంఘటన సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మరింత వెతకగా, ఇదే వైరల్ వీడియోపై డీసీపీ రూరల్ కమిషనర్ ఘజియాబాద్ పోలీసులు X(ట్విట్టర్)లో చేసిన పోస్టు ఒకటి లభించింది. ఈ పోస్టులో అంకుర్ విహార్, ఏసీపీ (ACP) అజయ్ కుమార్ సింగ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అంకుర్ విహార్, ACP మాట్లాడుతూ,“అతని బంధువైన సాద్‌ను అయూబ్ పైల్వాన్, అతని కుటుంబ సభ్యులు వారి ఇంట్లో బంధించి దాడి చేశారని ఆరోపిస్తూ ఇర్షాద్ అనే వ్యక్తి  లోనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని. రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా ఈ దాడి జరిగిందని, ఈ దాడిలో ఇరువర్గాలు గాయపడ్డాయిని మరియు సంబంధిత BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది, ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందుతులను అరెస్టు చేశాము” అని చెప్పారు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో రెండు ముస్లిం కుటుంబాల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll