కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన ఒక కోతి దాడి చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చుట్టూ పోలీసులతో పాటు కొందరు వ్యక్తులు ఉండటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇంత మంది తన చుట్టూ ఉన్న కూడా ఆ కోతి అమిత్ షా మీదే ఎందుకు దూకిందా అని అంటూ యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: హోంమంత్రి అమిత్ షా పైన ఒక కోతి దాడి చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్: ఇది 1 జూన్ 2019న అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టినప్పుడు తీసిన ఒక ఫోటోను ఉపయోగించి తయారు చేసిన AI-వీడియో. ఆరోజు తనపై ఒక కోతి దాడి చేసినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ఇటీవల హోంమంత్రి అమిత్ షా పైన ఒక కోతి దాడి చేసిందా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మాకు ఈ క్లెయిముకు మద్దతుగా ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. అలాగే, వైరల్ అవుతున్న వీడియో కూడా మాకు ఎటువంటి వార్తా కథనాల్లో లభించలేదు.
ఇక వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియోలోని మొదటి ఫ్రేముతో మ్యాచ్ అవుతున్న 1 జూన్ 2019 నాటి ఫోటో ఒకటి మాకు లభించలేదు.

1 జూన్ 2019న అమిత్ షా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వారు ప్రచురించిన వార్తా కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ) ఈ ఫోటో ఉంది.

హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ భవనానికి చేరుకొని హోం సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీవ్ జైన్ తదితర అధికారులను ఒక సమావేశం రీత్యా కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ సమావేశానికి సంబంధించి వచ్చిన మరిన్ని జూన్ 2019 నాటి వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ వార్తా కథనాల్లో ఎక్కడ కూడా ఆ రోజున అమిత్ షా పై ఒక కోతి దాడి చేసిందని పేర్కొనలేదు. అలాగే, 1 జూన్ 2019న జరిగిన ఈ సమావేశానికి చెందిన కొన్ని వీడియో రిపోర్టులలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఆయన కారు దిగి వచ్చి, అధికారులను కలిసి, ఫోటోలు దిగి హోమ్ మంత్రిత్వ శాఖ భవనం లోకి వెళ్లే వీడియో ఉంది. ఈ వీడియోలలో, వైరల్ వీడియో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అప్లోడ్ చేసిన ఫోటోలో మాదిరిగా అమిత్ షా చుట్టూ పోలీసులు, సఫారి దుస్తులు వేసుకున్న కొందరు అధికారులను మనం చూడవచ్చు. ఇందులో ఎక్కడ కూడా వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లుగా అమిత్ షా పైన కోతి దాడి చేయలేదు.
వైరల్ వీడియోని మేము పరిశీలించి చూడగా, అందులో కొన్ని ఫ్రాములలో, ఎడమవైపు నుంచొని ఉన్న పోలీసు అధికారి చేతిలో ఉన్న ఫోను మాయమైపోవడం మేము గమనించాము. అలాగే, అమిత్ షా పైన కోతి పడిన కొద్ది సేపటి వరకు తన చుట్టూ ఉన్న వారు ఎవరూ స్పందించలేదు.

ఇలాంటి తప్పిదాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలలో సహజంగా ఉంటాయి. ఇదే విషయాన్ని వెరిఫై చేయడానికి, AI ఉపయోగించి తయారు చేసిన వీడియోలను డిటెక్ట్ చేసే DeepFake-o-meter అనే టూల్‌లో ఈ వీడియోని చెక్ చేశాము. DeepFake-o-meter అనాలిసిస్‌లో ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసింది అని తేలింది.

చివరగా, హోంమంత్రి అమిత్ షా పైన ఒక కోతి దాడి చేసిందని చెప్తూ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.