పశ్చిమ బెంగాల్ సహా 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ యొక్క ఫేజ్-2, 4 నవంబర్ 2025న మొదలు పెట్టింది (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో ‘ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న SIR (ఓటర్ల జాబిత ప్రక్షాళన) కార్యక్రమానికి బెంబేలెత్తి.. బెంగాల్ నుంచి పరారవుతున్న లక్షలాది రోహిగ్యా బంగ్లాదేశ్ అక్రమ మరక జాగిలాల మంద.’ అని క్లెయిమ్ చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ,ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి వీళ్ళందరూ ఇలా వెళ్తున్నారని క్లెయిమ్ చేస్తున్న ఈ వీడియోలో, ఒక pier (పీర లేదా రేవు) మీద కొందరు వరుసగా నిలబడి, ఒక పడవ ఎక్కుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మొదలు పెట్టగానే ఇటీవల కొందరు అక్రమ బంగ్లాదేశీ వలసదారులు, రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్ వదిలి పారిపోతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో. దీనికి, భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్‌లోని మోంగ్లాలో ఈ వీడియోను తీశారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో ఇటీవల కొందరు అక్రమ బంగ్లాదేశీ వలసదారులు, రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్ వదిలి పారిపోతున్న దృశ్యాలను చూపిస్తుందని చెప్తూ, మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియోని తీసిన అదే స్థలంలో తీసిన అనేక టిక్-టాక్, ఫేస్‌బుక్ వీడియోలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇక్కడ).


ఈ ప్రదేశం బంగ్లాదేశ్‌లోని మోంగ్లా నది అని, మోంగ్లా ఘాట్ అని, ఈ వీడియోలు అప్లోడ్ చేసిన వారు పేర్కొన్నారు. ఈ వీడియోలను HM Shihab, HM Raju Hawlader అనే వ్యక్తులు తమ టిక్-టాక్, ఫేస్‌బుక్ పేజీలలో అప్లోడ్ చేశారు. వీళ్ల ఫేస్‌బుక్ పేజీల ఇంట్రోల ప్రకారం వెళ్లిద్దరూ బంగ్లాదేశ్‌లోని ఖుల్నా నివాసులు. వీళ్ల పేజీలలో ఈ ప్రదేశంలో తీసిన చాలా వీడియోలు ఉన్నాయి.


ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా మోంగ్లా అనేది బంగ్లాదేశ్‌లోని ఒక పట్టణం పేరు అని, అది బగేర్‌హాట్ జిల్లాలోని మోంగ్లా ఉపజిల్లాలో ఉందని మాకు తెలిసింది. ఈ ప్రదేశం గురించి ఆల్-జజీరా, Wion, అసోసియేటెడ్ ప్రెస్ (AP) వంటి మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల్లో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).


అలాగే, మోంగ్లా యొక్క శాటిలైట్ వ్యూ (satellite view), స్ట్రీట్ వ్యూలను మేము గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి చూడగా, అక్కడ వైరల్ వీడియోలో కనిపిస్తున్న అనేక pier(పీర)లు, పడవ ఘాట్‌లు ఉన్నాయని మాకు అర్థం అయ్యింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఇక్కడ ఒక పోర్టు కూడా ఉంది. వార్తా కథనాల ప్రకారం అది బంగ్లాదేశ్‌లోనే రెండవ పెద్ద సీ-పోర్టు (seaport).

అదనంగా, వైరల్ వీడియోని బగేర్‌హాట్‌లోని మోంగ్లా ఘాట్‌లో తీసారని చెప్పి, బంగ్లాదేశీ ఫ్యాక్ట్-చెకర్, తన్వీర్ మహతాబ్ అబీర్ ‘lighthouse journalism’ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు వస్త్ర కార్మికులని, వాళ్ల కార్యాలయాలకి వెళ్లడానికి వాళ్లు తరచూ ఇలా ప్రయాణిస్తారని ఆయన తెలిపారు. దీనిబట్టి, ఈ వీడియోకు పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదని మనకు అర్థం అవుతుంది.

చివరగా, కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మొదలు పెట్టగానే రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్ వదిలి పారిపోతున్న దృశ్యాలని చెప్పి బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో షేర్ చేస్తున్నారు.

