Fake News, Telugu
 

అక్రమ ఓటర్ కార్డులను తీసి వేస్తాం అని కేంద్ర ఎన్నికల సంఘం అనగానే, పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు చేపట్టిన నిరసన దృశ్యాలని చెప్తూ బంగ్లాదేశ్‌లో తీసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

కేంద్ర ఎన్నికల సంఘం అక్రమం గా వచ్చిన ఓటర్ కార్డ్ లు తీసి వేస్తాం అనగానే బెంగాల్ లో అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు రోడ్ల పైకి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు’ అని చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డుపై నినాదాలు చేస్తూ నడవడం మనం చూడవచ్చు. పశ్చిమ బెంగాల్ సహా 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ఫేజ్-2, 4 నవంబర్ 2025న మొదలు పెట్టిన నేపథ్యంలో (ఇక్కడ, ఇక్కడ) ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా వచ్చిన ఓటర్ కార్డులను తీసి వేస్తాం అనగానే, (SIR ప్రక్రియ మొదలు పెట్టగానే) ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు రోడ్ మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో. దీనికి, భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌లో 4 నవంబర్ 2025న మొదలు అవకముందే, అనగా 15 సెప్టెంబర్ 2025 నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు చేపట్టిన నిరసనను చూపిస్తుందని చెప్తూ, మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

అయితే, ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో మాకు 15 సెప్టెంబర్ 2025 నాటి కొన్ని సోషల్ మీడియా పోస్టులలో లభించింది (ఇక్కడ, ఇక్కడ).  దీన్ని బట్టి, ఈ వీడియో 4 నవంబర్ 2025న పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మొదలవక ముందు నుంచి, అలాగే 27 అక్టోబర్ 2025న ఎన్నికల సంఘం SIR యొక్క ఫేజ్-2ను ప్రకటించక ముందు నుంచే ఇంటర్నెట్‌లో ఉందని మనకు అర్థం అవుతుంది. 

ఈ వీడియో యొక్క హై క్వాలిటీ వెర్షన్‌ను ‘Biplob Biplob’ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ పేజీలో 15 సెప్టెంబర్ 2025న అప్లోడ్ చేశారు. బంగ్లా భాషలో ఉన్న ఈ వీడియో యొక్క వివరణను తెలుగులోకి తర్జుమా చేసి చూస్తే, అది -’ఈ రోజు ఉద్యమం యొక్క వీడియో ఫుటేజ్’ అని ఉంది. Biplob ఫేస్‌బుక్‌ పేజీలో తను బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న ఫరీద్‌పుర్‌ నివాసి అని పేర్కొన్నారు. 

ఈ వీడియో గురించి ఇండియా టుడేతో Biplob మాట్లాడుతూ, ఈ వీడియో బంగ్లాదేశ్‌ యొక్క  ఫరీద్‌పుర్‌ జిల్లాలోని భంగా అనే ఏరియాలో తీసినదని చెప్పారు. నియోజకవర్గ విభజనపై బంగ్లాదేశ్‌ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, భంగా ఉప జిల్లాలో కొన్ని నిరసనలు జరిగాయని తను ఇండియా టుడేకి చెప్పారు. 

దీని గురించి మరిన్ని వివరాల కోసం మేము ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ చేసి చూడగా, సెప్టెంబర్ 2025లో భంగా ప్రజలు నియోజకవర్గ విభజనపై బంగ్లాదేశ్‌ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారని రిపోర్ట్ చేసిన బంగ్లాదేశీ వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).   

అదనంగా, వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ తప్పు అని చెప్తూ, బంగ్లాదేశీ మీడియా సంస్థ ప్రోథోమ్ ఆలో వారు ప్రచురించిన ఒక ఫ్యాక్ట్-చెక్ కథనంలో, ఈ వీడియో తీసిన ప్రదేశం భంగా ఉపజిల్లాలో ఉన్న మన్‌సురాబాద్ హై స్కూల్ ఎదురు ఉన్న ఢాకా-ఖుల్నా హైవే అని పేర్కొన్నారు.

ఈ ప్రదేశాన్ని మేము గూగుల్ మ్యాప్స్‌లో చూడగా, వైరల్ వీడియో తీసింది అక్కడే అని మాకు స్పష్టం అయింది

చివరగా,  కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా వచ్చిన ఓటర్ కార్డులను తీసి వేస్తాం అనగానే, పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు రోడ్ మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియో అని చెప్తూ బంగ్లాదేశ్‌లో తీసిన వీడియోని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll