ఒక హిందూ వ్యక్తి కుంకుమ పెట్టుకొని ముస్లిం ప్రాంతానికి వెళ్తే, ముస్లింలు అతనితో దురుసుగా ప్రవర్తించి వారి ప్రాంతం నుండి గెంటేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ముస్లింలు టోపీలు పెట్టుకొని హిందూ ప్రాంతాలలో తిరుగుతుంటే హిందువులు పట్టించుకోరు కానీ, హిందువులు కుంకుమ పెట్టుకొని వారి ప్రాంతానికి వెళితే ముస్లింలు హిందువులపై వివక్ష చూపుతూ హిందువులను వెల్లగొడుతున్నారు, దీనినే మతోన్మాదం అంటారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందూ వ్యక్తి కుంకుమ పెట్టుకొని ముస్లింల ప్రాంతానికి వెళ్తే, ముస్లింలు అతనితో దురుసుగా ప్రవర్తించి తమ ప్రాంతం నుండి గెంటేసిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక ప్రాంక్ వీడియో. కాషాయ కండువ కప్పుకున్న హిందూ వ్యక్తితో ముస్లిం వ్యక్తి గొడవ పడుతుంటే, ముస్లింలు ఎవరికి మద్దతు పలుకుతారనే కాన్సెప్టూతో ‘PM 2 vlogs’ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోని రూపోందించారు. హిందూ-ముస్లింల మధ్య భేదభావాలు తొలిగిపోవాలనే ఉద్దేశంతో ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో రూపొందించినట్టు ఈ వీడియో రూపొందించిన నటులు తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘PM 2 vlogs’ అనే యూట్యూబ్ ఛానెల్ 26 జులై 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హిందూని ముస్లిం వ్యక్తి తరిమిగొడుతున్న మరొక సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో అని ఈ యూట్యూబ్ ఛానెల్ వీడియో వివరణలో తెలిపింది.
ముస్లిం ప్రాంతంలో కాషాయ కండువ కప్పుకొని తిరుగుతున్న హిందూ వ్యక్తితో ఒక ముస్లిం వ్యక్తి గొడవ పడుతుంటే, ముస్లింలు ఎవరికి మద్దతు పలుకుతారనే కాన్సెప్టుతో ఈ వీడియో రూపొందిస్తున్నామని ఈ వీడియో మొదటిలో హిందూ ముస్లింలుగా నటించిన వ్యక్తులు తెలిపారు. హిందూ-ముస్లింల మధ్య భేదభావాలు తొలిగిపోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని రూపొందిస్తున్నామని వారు వీడియో తెలిపారు. ఇదే కాన్సెప్టుతో వారు రూపొందించిన మరికొన్ని వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, హిందూ-ముస్లింల మధ్య భేదభావాలు తొలిగిపోవాలనే ఉద్దేశంతో రూపొందించిన ఒక ప్రాంక్ వీడియోని ముస్లింలు కుంకుమ పెట్టుకున్న హిందువుని తమ ప్రాంతం నుండి తరిమికొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.