Fake News, Telugu
 

ఒక ముస్లిం వ్యక్తి తన షాపు ముందు జాతీయ జండాను పెట్టడానికి వాదిస్తున్న స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

‘భారత్‌లో ఉంటూ జాతీయ జెండా పెట్టటానికి ఒప్పుకోవటం లేదు చూడండి’ అంటూ ఒక ముస్లిం వ్యక్తి తన షాప్ ముందు జండాను పెట్టవద్దని బ్రతిమిలాడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. దీని వెనుక ఎంత వాస్తవం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి తన షాపు ముందు జాతీయ జండాను పెట్టటానికి ఒప్పుకోకుండా వాదిస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగినవి కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. రితిక్ కటారియా అనే పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో మొత్తం వీడియో అప్లోడ్ చేయబడింది. ఇది మోటివేషనల్ వీడియో అని, ఇది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తీసింది అని ఈ ఛానల్ వాళ్లు వివరణ ద్వారా స్పష్టం చేసారు. కావున ఈ పోస్టు ద్వారా చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో యొక్క కీ ఫ్రాములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, రితిక్ కటారియా అనే పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో మొత్తం వీడియో అప్లోడ్ చేసినట్టుగమనించాం. దీని కింద, ఇది మోటివేషనల్ వీడియో అని, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తీసింది అని స్పష్టంగా తెలిపారు.

ఛానల్ యొక్క బయోలో అతను హర్యానా పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ అని నటన తన యొక్క ప్యాషన్ అని తెలపడం గమనించాం.

ఈ పూర్తి వీడియోను గమనించగా, ఈ వీడియోలో కనపడే ముస్లిం వ్యక్తి, జాతీయ జండాను తన షాపు బయట పెట్టే జనాలను అడ్డుకుంటూ, ‘దయచేసి జండాను ఇక్కడ పెట్టకండి’ అంటూ బతిమిలాడుకుంటాడు. ఒక పోలీసు వచ్చి జండా ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తే “మన జాతీయ జండాను ఎత్తైన స్థానంలో ఉంచాలి, దిగువ స్థానంలో కాదు అందుకే వారు పెట్టే స్థానంలో జండాను ఉంచను” అని ఆ ముస్లిం వ్యక్తి వాదించాడు. తరువాత, “మీరు మా ముస్లింలను చూస్తే ఏం అనుకుంటారు? మేము దేశం కోసం ఏమి చెయ్యలేం అనుకుంటారా? దేశ స్వతంత్రం కోసం కేవలం హిందువులే కాదు ముస్లింలు కూడా పోరాడారు. మన రాజ్యాంగం కూడా మతాల వాళ్లు కలిసి ఉండాలని తెలిపింది” అంటూ వాదిస్తాడు.

ఈ ఛానల్లో ఉన్న ఇటువంటి స్క్రిప్టెడ్ వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఒక ముస్లిం వ్యక్తి తన షాపులో జాతీయ జండాను పెట్టటానికి ఒప్పుకోకుండా వాదిస్తున్న స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll