సలీం అనే ముస్లిం వ్యక్తి, రవి అనే హిందూ వ్యక్తిలా నటిస్తూ, ఒక హిందూ అమ్మాయిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు పోలీసులు, ఒక వ్యక్తి id కార్డ్ అడిగి, తన అసలు పేరును (సలీం) ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్న అమ్మాయికి చెప్పి, అతని గుట్టు రట్టు చేయడం మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రవి అనే హిందూ వ్యక్తిలా నటిస్తూ, ఒక హిందూ అమ్మాయిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్న సలీం అనే ముస్లిం వ్యక్తిని పోలీసులు పట్టుకుంటున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. ఈ వీడియోని, మాంటీ దీపక్ శర్మ అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ క్లెయిములో చెప్తున్నట్లుగా ఇటీవల సలీం అనే వ్యక్తి హిందువుగా నటిస్తూ, ఒక హిందూ అమ్మాయిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని పోలీసులు పట్టుకున్నట్లు ఏవైనా వార్తా కథనాలు వచ్చాయా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. అయితే ఈ సెర్చ్ ద్వారా మాకు వైరల్ వీడియోకి ముడిపడి చేస్తున్న క్లెయిమ్ గురించి రిపోర్ట్ చేసిన ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.
ఆ తరువాత, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో యొక్క అసలు వీడియో మాకు ‘monty_deepak_sharma’ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ యొక్క ఫేస్‌బుక్ (ఆర్కైవ్ లింక్), యూట్యూబ్ అకౌంటుల్లో లభించింది.

వైరల్ అవుతున్న వీడియోని, మాంటీ దీపక్ శర్మ 27 జూలై 2025న తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడు. ఇతని సోషల్ మీడియా అకౌంటుల్లో వినోదం కోసం తయారు చేసిన స్క్రిప్టెడ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు (ఇక్కడ, ఇక్కడ).


వైరల్ వీడియోలో పోలీసులు, పెళ్లి చేసుకున్న అమ్మాయి, తన అమ్మ ఇంకా సలీం పాత్రల్లో నటించిన వారందరూ మాంటీ దీపక్ శర్మ ప్రొఫైలల్లో పోస్ట్ చేసిన చాలా స్క్రిప్టెడ్ వీడియోలలో ఉన్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

గతంలో మాంటీ దీపక్ శర్మ వీడియోలు కొన్ని నిజమైన సంఘటనలు అని చెప్తూ సోషల్ మీడియా యూజర్లు షేర్ చేయగా, ఆ క్లెయిములు ఫేక్ అని, ఫ్యాక్ట్‌లీ కొన్ని ఫ్యాక్ట్-చెక్ కథనాలను ప్రచురించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)
చివరగా, హిందూ వ్యక్తిలా నటిస్తూ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సలీం అనే ముస్లిం వ్యక్తిని పోలీసులు పట్టుకున్న వీడియో అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.