Fake News, Telugu
 

ఈజిప్ట్ దేశంలో చిత్రీకరించిన ఒక స్క్రిప్టెడ్ వీడియోని భారతదేశంలో బుర్ఖా ధరించిన మహిళ బాలుడిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

బుర్ఖా ధరించి ఉన్న ముస్లిం మహిళ ఒక బాలుడిని స్పృహకోల్పోయేలా చేసి అతన్ని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. బుర్ఖా ధరించిన మహిళ ఒక బాలుడి భుజంపై పిన్నుతో గుచ్చి, అతను స్పృహ కోల్పోయిన తరువాత మరొకరి సహాయంతో ఆ బాలుడిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం పిల్లలను ఎత్తుకపోయి అక్రమ రవాణా చేసే భయంకర నేరాలు జరుగుతున్నాయని, ఆడపిల్లలను కూడా కిడ్నాప్ చేస్తున్నారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్ : బుర్ఖా ధరించి ఉన్న ముస్లిం మహిళ ఒక బాలుడిని మత్తులోకి దించి అతన్ని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈజిప్ట్ దేశానికి చెందిన కొందరు యువకులు సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ పొంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చిత్రీకరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్ అని, ఈ వీడియోని చిత్రికరించిన యువకులని అరెస్ట్ చేసినట్టు ఈజిప్ట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Ashraq News Al Sharq’ వార్తా సంస్థ తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఇది ఒక స్క్రి ప్టెడ్ వీడియో అని, ఈజిప్ట్ దేశానికి చెందిన నలుగురు యువకులు ఈ వీడియోని కావాలని చిత్రీకరించారని ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ స్క్రిప్టెడ్ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలని  తెలుపుతూ ‘Al Hadath’ వార్తా సంస్థ 29 జూన్ 2022 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈజిప్ట్ దేశానికి చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదించాలనే  ఉద్దేశంతో ఈ వీడియోని చిత్రీకరించారని ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది.   

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్ అని, సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే నలుగురు యువకులు ఈ వీడియోని చిత్రీకరించారని తెలుపుతూ ఈజిప్ట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ ఫేస్‌బుక్‌ పేజీలో 29 జూన్ 2022 నాడు ఒక వీడియోని పబ్లిష్ చేసింది. ఈ వీడియోని చిత్రీకరించిన నలుగురు యువకులని అరెస్ట్ చేసినట్టు ఈజిప్ట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఈ స్క్రిప్టెడ్ వీడియోని చిత్రీకరించడానికి గల కారణాలని ఒక నిందితుడు వివరిస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ స్క్రిప్టెడ్ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఒక డ్రామా అని, నిజమైన సంఘటన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈజిప్ట్ దేశంలో చిత్రీకరించిన ఒక స్క్రిప్టెడ్ వీడియోని భారతదేశంలో బుర్ఖా ధరించిన ముస్లిం మహిళ బాలుడిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll