‘ఎర్రబస్సు అయినా ఏయిర్ బస్ అయినా.. ఒక్కటే సీటు కోసం విమానంలో గొడవ పడ్డ ప్రయాణికులు’ అని చెప్తూ ఇద్దరు ప్రయాణికులు ఒక విమానం లోపల వాదించుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఒక విమానం లోపల ఒకటే సీటు కోసం గొడవ పడుతున్న ఇద్దరు ప్రయాణికుల వీడియో.
ఫ్యాక్ట్: ఇది ఫ్లై హై అనే ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు అప్లోడ్ చేసిన ఒక స్క్రిప్టెడ్ ఎడ్యుకేషనల్ వీడియో, నిజమైన సంఘటన కాదు. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. అయితే, ఈ సెర్చ్ ద్వారా, ఇటీవల ఒక విమానంలో సీటు కోసం ఇటువంటి గొడవ జరిగింది అని చెప్తున్న ఈ దృశ్యాలతో కూడిన వార్తా కథనాలు ఏవీ మాకు దొరకలేదు. వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇదే వీడియో ఉన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి మాకు లభించింది.
ఈ వీడియోను 16 జూన్ 2025న Fly-high Institute, Nagpur వారు అప్లోడ్ చేశారు. దీన్ని వారు రుతు రాంటేకే అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తో కలిసి పోస్ట్ చేశారు. రుతు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్క్రిప్టెడ్ కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

‘ఫ్లై హై ఇన్స్టిట్యూట్’ వారి వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం వాళ్ళు ఏవియేషన్, హాస్పిటలిటీ, ట్రావెల్ & టూరిజం కోర్సులు చెప్తారు. వీళ్ల సోషల్ మీడియా పేజీలలో, విమానాల్లో జరిగే వివిధ పరిస్థితుల్లో సిబ్బంది ఏ విధంగా స్పందించాలి అని నేర్పించే స్క్రిప్టెడ్ వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) ఉంటాయి.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో యొక్క వివరణ మనం చూసినా కూడా మనకు ఇది స్పష్టం అవుతుంది. ఒక మెజీషియన్ విమానంలో మ్యాజిక్ చేయడాన్ని ఒక మహిళ అడ్డుపడగా, వారి మధ్య వాగ్వాదం జరిగిందని, సమయానికి విమాన సిబ్బంది జోక్యం చేసుకొని గొడవ పెద్దది కాకుండా చూసుకున్నారని ఈ పోస్ట్ యొక్క వివరణలో చెప్పారు.

వీరి ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇటువంటి డెమాన్‌స్ట్రేషన్ వీడియోలు చాలానే ఉన్నాయి. కొన్ని వీడియోలు వీరు బాలీవుడ్ నటి రాఖీ సావంత్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దీపక్ కలాల్తో కలిసి షూట్ చేశారు.
గతంలో, దీపక్ కలాల్తో కలిసి తీసిన ఒక వీడియో నిజమైన సంఘటనను చూపిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ క్లెయిమ్ ఫేక్ అని చెప్తూ మేము ఒక ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ ప్రచురించాము. ఆ ఆర్టికల్‌ను ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఒక విమానం లోపల ఇద్దరు ప్రయాణికులు గొడవ పడుతున్న నిజమైన వీడియో అని ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు