Fake News, Telugu
 

అఫ్గానిస్తాన్‌ వార్డక్‌లో ఇనుమును కరిగించే రాయి అని షేర్ చేస్తున్న ఈ వీడియో ఫేక్

0

అఫ్గానిస్తాన్‌ వార్డక్‌లో ఇనుమును కరిగించే రాయి ఉందని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ రాయి ముట్టుకుంటే చల్లగా ఉంటుందని, కానీ దానిపై ఇనుము లేక స్టీల్ పెడితే నిమిషంలో కరిగిపోతుందని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అఫ్గానిస్తాన్‌ వార్డక్‌లో ఇనుమును కరిగించే రాయి వీడియో.

ఫాక్ట్: వీడియోలో రాయిపై కరుగుతున్నది ఇనుము కాదు. ఎందుకంటే ఇనుము కరిగిన తర్వాత ఎరుపు రంగులో కనబడుతుంది; వీడియోలో కరిగాక, దాని రంగు మారలేదు. ఇనుమును (Wrought Iron) కరిగించడానికి సుమారు 1500°C ఉష్ణోగ్రత అవసరం. స్టీల్ (ఉక్కు) కరిగించడానికి కూడా సుమారు అంతే ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. నల్లగా ఉండే ఉపరితలం (surface) తొందరగా వేడెక్కుతుంది, అలాగని ఎండలో ఉన్న ఒక నల్లరాయి ఈ ఉష్ణోగ్రతను (1500°C) చేరుకోవటం అంత సులభం కాదు. 2018లో, ఇటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయినప్పుడు, స్నోప్స్ వారు రాసిన ఆర్టికల్‌లో, అది ఇనుము కాదని, గాలియం అయ్యుండొచ్చని తెలిపారు. గాలియం సుమారు 30°C దగ్గర కరుగుతుందని, ఎండలో ఉన్న ఒక నల్లరాయి ఈ ఉష్ణోగ్రతను సులభంగా చేరుకోగలదు. గాలియం ఒకటే కాకుండా మెర్క్యూరీ, ఫ్రాన్సియం, సీసియం, రుబీడియం వంటి లోహాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలో కరుగుతాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.                                               

వీడియోలో చూపించినట్టుగా అది నిజంగానే ఇనుము అయ్యుంటే అలా కరిగేది కాదు. ఎందుకంటే ఇనుము కరిగిన తర్వాత ఎరుపు రంగులో కనబడుతుంది; వీడియోలో అదే రంగులో (ఎరుపు కాకుండా) ఉన్నట్టు చూడొచ్చు. ఇనుమును కరిగిస్తున్న ఒక యూట్యూబ్‌ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఇనుమును (Wrought Iron) కరిగించడానికి సుమారు 1500°C ఉష్ణోగ్రత అవసరం. స్టీల్ (ఉక్కు) కరిగించడానికి కూడా సుమారు అంతే ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. నల్లగా ఉండే ఉపరితలం (surface) తొందరగా వేడెక్కుతుంది, అలాగని ఎండలో ఉన్న ఒక నల్లరాయి ఈ ఉష్ణోగ్రతను (1500°C) చేరుకోవటం అసాధ్యం.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో ఒక ఫేస్బుక్ పోస్టులో లభించింది. అది ఒక ప్రాంక్ (prank) మాత్రమే అని, వీడియోలోని మేకులు ఇనుము కాదని, అవి గాలియంతో చేసినవని అందులో తెలిపారు. ఆ వీడియో గురించి కూడా ఆ ఫేస్బుక్ పోస్టులో వివరించారు. ఈ వీడియోకు సంభందించి ఒక ఆర్టికల్ కూడా ప్రచురించారు, అందులో కూడా, ఇనుము కాదని, గాలియం అని తెలిపారు.

ఇటువంటి వీడియోలు కొన్ని ఇంతకముందు నుంచే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 2018లో, ఇటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయినప్పుడు, స్నోప్స్ వారు ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసారు. ఆ వీడియోలో ఉన్నది గాలియం అయ్యుండొచ్చని వారు తెలిపారు. గాలియం సుమారు 30°C దగ్గర కరుగుతుందని, ఎండలో ఉన్న ఒక నల్లరాయి ఈ ఉష్ణోగ్రతను సులభంగా చేరుకోగలదని తెలిపారు. గాలియం మేకులు కూడా అదే విధంగా ఉండొచ్చని ఈ యూట్యూబ్‌ వీడియో ఉదాహరణగా చూపించారు.

కానీ, గాలియం ఒకటే కాకుండా మెర్క్యూరీ, ఫ్రాన్సియం, సీసియం, రుబీడియం వంటి లోహాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలో కరుగుతాయి. ఒకవేళ 40°C కంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే, ఈ లోహాలు అన్నీ కరుగుతాయి. కాబట్టి, వీడియోలో ఉన్నది, ద్రవాంకం (melting point) బాగా ఎక్కువగా ఉన్న ఇనుము, ఉక్కు అయితే కాదు. అఫ్గానిస్తాన్‌ వార్డక్లో ఇనుమును కరిగించే రాయి ఉన్నట్టుగా ఇటీవల ఎటువంటి వార్తలు రాలేదు.

చివరగా, అఫ్గానిస్తాన్‌ వార్డక్లో ఇనుమును కరిగించే రాయి అని ఈ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll