Fake News, Telugu
 

వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకుని ఉన్న ఫోటోని తప్పుదోవ పట్టించే కథనంతో షేర్ చేస్తున్నారు

0

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకుని ఉన్న ఫోటోతో కూడిన గ్రాఫిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవిడ బైబిల్ లేకుండా బయటకు కూడా రారు అని, తను క్రైస్తవ మతాన్ని నమ్ముతారు అని అర్థం వచ్చేలాగా క్లెయిమ్ చేస్తూ దీన్ని షేర్ చేస్తున్నారు. ఇదే ఫొటోలో వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు తన తల్లి వై.ఎస్. విజయమ్మ కూడా ఉన్నారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ల్యాబ్ రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో ఇది వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి చేతిలో బైబిల్ పట్టుకున్న ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): 2020లో దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గురించి తన భార్య వై.ఎస్. విజయమ్మ రాసిన పుస్తకం ‘నాలో నాతో వైఎస్ఆర్’ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఆ కార్యక్రమంలో తీసిన వీడియోలను బట్టి వై.ఎస్. విజయమ్మ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డికి పట్టుకోమని బైబిల్ ఇచ్చారని స్పష్టమవుతోంది. గతంలో చాలా ఇంటర్వ్యూలలో స్వర్ణలత, తన హిందూ మత విశ్వాసాల గురించి చెప్పారు. 2019లో వైవీ సుబ్బారెడ్డి మతంపై వివాదం తలెత్తగా, దాన్ని తిరస్కరించి తను హిందువు అని చెప్పారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిలా ఉంది.

వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌ని వెరిఫై చేయడానికి అందులో ఉన్న ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఇవే విజువల్స్ ఉన్న యూట్యూబ్ వీడియో ఒకటి మాకు లభించింది. ఇది జూలై 2020లో వై.ఎస్. విజయమ్మ రచించిన ‘నాలో నాతో వైఎస్‌ఆర్‌’ పుస్తకం యొక్క ఆవిష్కరణకి చెందిన వీడియో. ఈ పుస్తకావిష్కరణ సభ ఆంధ్రప్రదేశ్‌లోని ఇడుపులపాయలో జరిగింది.ఈ యూట్యూబ్ వీడియో యొక్క 5:42 టైమ్‌స్టాంప్‌ దగ్గర ఉన్న కీ ఫ్రేమ్ వైరల్ అవుతున్న ఫోటో ఒకటే.

అయితే, 0:41 టైమ్‌స్టాంప్‌ దగ్గర మనం వై.ఎస్. జగన్ తల్లి వై.ఎస్. విజయమ్మ తన వెనుక నిలబడి ఉన్న వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డికి తన బైబిల్ ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇదే విజువల్ మనం టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చిన ఇదే సభకి సంబంధించిన వీడియో రిపోర్టులో కూడా చూడవచ్చు. 

స్వర్ణలత రెడ్డి మతపరమైన నమ్మకాల గురించి ఇంటర్నెట్లో వెతకగా, తనకు హిందూ మతం పైన ఉన్న విశ్వాసం గురించి తను చెప్పిన ఇంటర్వ్యూలు (ఇక్కడ మరియు ఇక్కడ) మాకు లభించాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను వెంకటేశ్వర స్వామిని జన్మజన్మల తండ్రిగా భావిస్తారని చెప్పారు. తను క్రైస్తవ మతాన్ని నమ్ముతాను అని ఏ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పలేదు. తన సోదరి వై.ఎస్. విజయమ్మ క్రైస్తవ మతాన్ని నమ్ముతారు అని, వారిరువురూ పరస్పరం వారి మతాలని గౌరవించుకుంటాము అని ఒక ‘IDream’ సంస్థకి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదనంగా, స్వర్ణలత రెడ్డి ‘ధ్యానం మరియు ఓంకారం’ గురించి ప్రసంగిస్తున్న యూట్యూబ్ వీడియో కూడా లభించింది.

2019లో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించే సమయంలో ఆయన మతంపై వివాదం చెలరేగింది. అతను క్రిస్టియన్ అని సోషల్ మీడియాలో విస్తృతంగా క్లెయిమ్ చేయబడింది, అయితే అతను TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘నేను పుట్టినప్పటి నుంచీ హిందువునే’ అని చెప్పారు. 

చివరిగా, వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకున్న ఫోటో తప్పుదోవ పట్టించే కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll