Fake News, Telugu
 

వెస్ట్రన్ రైల్వేలో మొదటిసారి పూర్తిగా మహిళా సిబ్బందిచే నడపబడిన ఒక గూడ్స్ రైలు సిబ్బంది ఫొటోని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు

0

లోకల్ ట్రైన్‌లో స్కూల్‌కి వెళ్తున్న ఒక అమ్మాయి దగ్గర టికెట్ లేదని 450 రూపాయల ఫైన్ వేసి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ అమ్మాయి ఇయర్ రింగ్స్‌ను బలవంతంగా ఒక టీసీ లాక్కుంటున్న ఫోటో అని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మనుషులు అధికారులుగా ఉన్నందుకు భారతదేశం మొత్తం సిగ్గుపడాలని చేప్తూ, ఈ ఫోటోను యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఎంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక రైలులో టికెట్ లేకుండా స్కూల్‌కి వెళ్తున్న అమ్మాయికి, టీసీ 450 రూపాయల ఫైన్ వేసి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోవడంతో తన ఇయర్ రింగ్స్‌ను బలవంతంగా లాక్కుంటున్న ఫోటో.

ఫ్యాక్ట్ (నిజం): జనవరి 2021లో వెస్ట్రన్ రైల్వే (Western Railway) చరిత్రలో మొదటి సారిగా, పూర్తిగా మహిళా సిబ్బంది ద్వారా ఒక గూడ్స్ రైలు ఆపరేట్ చేయబడింది. వైరల్ ఫోటోలో ఉన్నది ఆ సిబ్బందే. వైరల్ పోస్టులో చెప్తున్నది మొత్తం ఈ ఫోటో చుట్టూ అల్లిన ఒక కట్టు కథ. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్, తప్పు

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ ఫొటోని ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ ఫోటో ఉన్న జనవరి 2021 నాటి కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.

ఈ కథనాల ప్రకారం, వైరల్ ఫోటోలో ఉన్న మహిళలు ఒక గూడ్స్ రైలు సిబ్బంది. వీరు వెస్ట్రన్ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, పూర్తిగా మహిళా సిబ్బంది ద్వారా ఆపరేట్ చేయబడిన మొట్ట మొదటి గూడ్స్ రైలును నడిపారు. ఈ విషయం గురించి వెస్ట్రన్ రైల్వే వారు తమ ‘X’ ద్వారా 6 జనవరి 2021న ట్వీట్ చేస్తూ (ఇక్కడ, ఇక్కడ), ఈ రైలు 5 జనవరి 2021న మహారాష్ట్రలోని వాసై రోడ్ నుంచి గుజరాత్‌లోని వడోదర మధ్య నడిచిందని చెప్పారు.

ఈ రైలు యొక్క లోకో పైలట్ పేరు కుంకుమ్ డోంగ్రే, అసిస్టెంట్ లోకో పైలట్ పేరు ఉదితా వర్మ, గూడ్స్ గార్డ్ పేరు ఆకాంక్ష రాయ్. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలు మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఇక వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా, ఒక స్కూల్‌కి వెళ్లే బాలిక, టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు 450 రూపాయలు ఫైన్ వేసి, తన దగ్గర డబ్బులు లేనందున తన ఇయర్ రింగ్స్‌ను టీసీ బలవంతంగా తీసుకున్న సంఘటన ఏదైనా ఇటీవల జరిగిందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. అయితే, ఈ సెర్చ్ ద్వారా మాకు ఎటువంటి విశ్వసానీయ వార్తా కథనాలు లభించలేదు.

చివరగా, వెస్ట్రన్ రైల్వేలో (Western Railway) మొట్టమొదటిసారి, పూర్తిగా మహిళా సిబ్బందిచే నడుపబడిన ఒక గూడ్స్ రైలు పైలట్, లోకో పైలట్, గూడ్స్ గార్డ్ తదితరులు ఉన్న ఫొటోని ఒక కట్టు కథతో షేర్ చేస్తున్నారు.   

Share.

About Author

Comments are closed.

scroll