Fake News, Telugu
 

2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీని కొందరు పూజారులు సన్మానించిన ఫోటోను అసదుద్దీన్ గుడికి వెళ్లి అర్చన చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు

0

2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు అని చెప్తూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ ఫోటోలో అసదుద్దీన్ ఒవైసీ పూల మాల వేసుకుని పూజారులతో కలిసి నిల్చున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు, అందుకు సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్ళినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఈ వైరల్ ఫోటో ఇటీవల 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ అసెంబ్లీ నియోజికవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించినప్పటిది. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూల మాల వేసి, శాలువాతో సత్కరించిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఈ వైరల్ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).ఈ వార్తా కథనాల ప్రకారం హైదరబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్‌పేట్ అసెంబ్లీ నియోజికవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూల మాల వేసి, శాలువాతో సత్కరించారు.

ఇదే ఫోటోను 02 మే 2024 AIMIM పార్టీ తమ అధికారిక X(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఈ ఫోటో యొక్క వివరణలో, హైదరాబాద్ పార్లమెంట్ AIMIM పార్టీ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట్ ఎంఎల్ఏ బాలలాతో కలిసి మలక్‌పేట్ అసెంబ్లీ  అసెంబ్లీ నియోజికవర్గం పరిధిలో మూసారాంబాగ్‌, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, పతంగి గుర్తుకు ఓటు వేయాలని కోరారు అని పేర్కొంది. దీన్ని బట్టి అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రచారంలో  పూజారులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒవైసీ గుడికి వెళ్ళినట్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని మనం నిర్థారించవచ్చు.

చివరగా, 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీని కొందరు పూజారులు సన్మానించినప్పుడు తీసిన ఫోటోను షేర్ చేస్తూ అసదుద్దీన్ గుడికి వెళ్ళినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll