Fake News, Telugu
 

బలోచిస్తాన్‌ తిరుగుబాటు దారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేస్తున్న దృశ్యాలంటూ 2024లో యెమెన్‌లో హౌతీ దళాలు చేసిన సైనిక విన్యాసాల దృశ్యాలను షేర్ చేస్తున్నారు

0

“బలోచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటు దారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా, ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బలోచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటు దారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో పాకిస్తాన్‌కు సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో మార్చి 2024లో యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు దళాలు నిర్వహించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల వీడియో (ఆర్కైవ్డ్ లింక్) యూట్యూబ్‌లో లభించింది. ఈ వీడియోను మీడియా సంస్థ ‘అల్ అరేబియా టీవీ’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 21 ఏప్రిల్ 2024న షేర్ చేసింది. ఈ వీడియో టైం స్టాంప్ 03:13 వద్ద నుండి వైరల్ వీడియోలోని దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో మార్చి 2024లో హౌతీ మిలీషియా సేనలు నిర్వహించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. హౌతీ మిలీషియా సేనలు ఇజ్రాయెల్, అమెరికన్ & బ్రిటిష్ దళాలను లక్ష్యంగా చేసుకుని ఎలా దాడి చేయాలో ఈ సైనిక విన్యాసాలలో ప్రదర్శించారు.

ఈ న్యూస్ వీడియోలో కనిపిస్తున్న లోగో ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే లోగో కలిగి ఉన్న X(ట్విట్టర్) ఖాతా @MMY1444 లభించింది. అలాగే, ఇదే లోగో కలిగి ఉన్న”mmy.ye” అనే వెబ్‌సైట్‌ కూడా లభించింది.

ఈ X(ట్విట్టర్) ఖాతా బయోలో “యెమెన్ మిలిటరీ మీడియా – MMY రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ – రక్షణ మంత్రిత్వ శాఖ” అని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ X ఖాతా మరియు ఈ వెబ్‌సైట్‌ హౌతీ తిరుగుబాటు దళాలకు సంబంధించినది అని తెలుస్తుంది. హౌతీ తిరుగుబాటు దళాలకు సంబంధించిన ఈ X ఖాతాలో, వెబ్‌సైట్‌లను పరిశీలించగా ఈ వైరల్ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియోను 10 మార్చి 2024న షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియో వివరణ ప్రకారం, వైరల్ వీడియో 10 మార్చి 2024న హౌతీ ఆరవ సైనిక ప్రాంతం రిజర్వ్ దళాలకు సంబంధించిన ప్రత్యేక దళాలు నిర్వహించిన సైనిక విన్యాసాలను చూపిస్తుంది.

చివరగా, ఈ వైరల్ వీడియో మార్చి 2024లో యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు దళాలు నిర్వహించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll