ఇటీవల NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో NEET(UG) 2024 పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సంబంధించి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఈ ప్రకటనలో ఎక్కువ శాతం ముస్లిం విద్యార్థులు ఉండడంతో NEET(UG) పేపర్ లీక్ చేసింది ముస్లింలే అని, ఈ ప్రకటనలో ఉన్న ముస్లింలు పేపర్ లీక్ వల్ల లాభపడ్డారని, అందుకే వీరికి ర్యాంకులు వచ్చాయని అంటూ ఈ ప్రకటనను షేర్ చేస్తున్నారు (ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లింలు NEET(UG) 2024 పేపర్ లీక్ చేయడం వల్ల ఈ ప్రకటనలో ఉన్న ముస్లిం విద్యార్థులు ర్యాంకులు సాధించారు.
ఫాక్ట్(నిజం): NEET(UG) 2024 పేపర్ లీక్ నిందితుల్లో ముస్లిములతో పాటు హిందువులు కూడా ఉన్నారు. ఇకపోతే, ఈ ప్రకటన కేరళలోని ‘యూనివర్సల్ ఇన్‌స్టిట్యూట్’ ఇచ్చింది. ఈ విద్యార్థులకు పేపర్ లీక్‌తో ఎటువంటి సంబంధం లేదు. కేరళ రాష్టానికి పేపర్ లీక్ అంశంతో సంబంధం ఉన్నట్టు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కొట్టక్కల్ పట్టణ జనాభాలో ముస్లింలు ఎక్కువ ఉండడంతో ర్యాంక్ సాధించిన వారిలో ముస్లింలు ఎక్కువ ఉండవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
NEET వివాదం:
05 మే 2024 రోజున జరిగిన NEET(UG) 2024 పరీక్ష అనంతరం దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయి అంటూ నిరసనలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు, మేఘాలయ, సూరత్, బహదూర్‌ఘర్ (హర్యానా), మరియు చండీగఢ్‌లలో ఒక్కొక్కటి సహా కొన్ని పరీక్షా కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యార్థులకు టైం సరిపోలేదంటూ నిరసన వ్యక్తం చేసారు. అలాగే బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు పంజాబ్ & హర్యానా, ఢిల్లీ మరియు ఛత్తీస్‌గఢ్ మొదలైన హైకోర్టులలో ఈ విషయమై పిటిషన్‌లు దాఖలు చేశారు.
కొన్ని సెంటర్‌లలో పరీక్షా నిర్వహణ ఆలస్యం జరిగిందని NTA గుర్తించి, ఈ కేంద్రాలలో పరీక్ష రాసిన 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపింది. ‘నార్మలైజేషన్ ఫార్ములా’ ప్రకారంగా ఈ గ్రేస్ మార్కులు కలిపింది. ఐతే ఈ గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడంతో ఇతర విద్యార్థులు దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఐతే NTA ఈ అంశాన్ని పరిశిలించడానికి ఒక కమిటీని వేయగా, ఆ కమిటీ ఈ గ్రేస్ మార్కులు రద్దు చేసి, తిరిగి ఆ 1563 మంది విద్యార్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఈ 1563 మందిలో పరీక్ష రాయమనుకునే వారికి 05 మే రోజున నిర్వహించిన పరీక్ష ఫలితాలు కేటాయించి, తిరిగి పరీక్ష రాసే వారికి మాత్రం కొత్త ఫలితాలు కేటాయించాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించింది.

NTA ఈ సిఫార్సులను ఆమోదించి తిరిగి పరీక్షను నిర్వహించింది. చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా మరియు మేఘాలయలోని కేంద్రాలలో జరిగిన రీటెస్ట్‌లో సుమారు 813 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఆ తరవాత పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
పేపర్ లీక్ నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ:
పేపర్ లీక్ వివాదానికి సంబంధించి CBI దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసింది. వార్తా కథనాల ప్రకారం, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ఈ పేపర్ లీక్ లింకులున్నాయని CBI గుర్తించింది.
ఈ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుల్లో సంజీవ్ ముఖియా గ్యాంగ్ కీలక పాత్రధారి అని CBI గుర్తించింది. ఐతే నిందితుల్లో హిందూ మరియు ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరు ప్రధానంగా ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ విద్యార్థుల సంప్రదించినట్టు CBI గుర్తించిందని కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి. ఐతే ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కేరళ రాష్ట్రానికి సంబంధం ఉన్నట్టు మాత్రం ఎలాంటి కథనాలు లేవు.

వైరల్ అయిన ప్రకటన :
ఈ వైరల్ క్లిప్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇది కేరళలోని కొట్టక్కల్‌లో ఉన్న ‘యూనివర్సల్ ఇన్‌స్టిట్యూట్’ అనే కోచింగ్ సెంటర్‌కు సంబంధించిందని తెలిసింది. ఆ కోచింగ్ సెంటర్ తమ వెబ్‌సైట్‌లో ఇదే ప్రకటనను ఉంచింది. తమ ఇన్స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకొని ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రశంసిస్తూ ఈ ప్రకటన విడుదల చేసింది. కేరళలోని ఒక వార్తా పత్రిక కూడా ఈ ప్రకటనను ప్రచురించింది.

ఐతే ఈ విద్యార్థులకు పేపర్ లీక్‌తో ఎటువంటి సంబంధం లేదు. పేపర్ లీక్ పైన తెలిపిన కొన్ని ఉత్తర రాష్ట్రాలకు మాత్రమే పరిమితి అయ్యింది. ఈ పేపర్ లీక్ అంశంలో కేరళ పేరు ఎక్కడా రాలేదు. ఇదే విషయమై ఆ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని సంప్రదించగా ఈ ప్రకటనలో ఉన్న విద్యార్థులు అందరు కేరళకు చెందిన వారే అని, వీరు కేరళలోనే పరీక్ష రాసినట్టు తెలిపారు. ఈ ప్రకటనలో కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల వారు కూడా ఉన్నారని, ఐతే పేపర్ లీక్‌తో వీరికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వారు చెప్పినట్టు ఈ పత్రికా ప్రకటనలో హిందూ పేర్లు కూడా కొన్ని చూడొచ్చు.

ఇకపొతే 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలోని కొట్టక్కల్ పట్టణ జనాభాలో ముస్లింలు 72.99% ఉండగా, హిందువులు 26.13% ఉన్నారు. అందువల్ల ర్యాంక్ సాధించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే ఉండే అవకాశం ఉంది.
చివరగా, కేరళలోని కోచింగ్ సెంటర్ తమ విద్యార్థులు సాధించిన ర్యాంకులకు సంబంధించి ఇచ్చిన ప్రకటనను NEET పేపర్ లీక్‌కు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.