మహారాష్ట్ర పోలీసులు పొట్టి బట్టలు వేసుకున్నందుకు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. మరొక వీడియోలో ఆ అమ్మాయిని యూపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు దుస్తులలో ఉన్న ఇద్దరు మహిళలు పొట్టి బట్టలు వేసుకున్న ఒక అమ్మాయిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పొట్టి బట్టలు వేసుకున్నందుకు మహారాష్ట్ర/యూపీ పోలీసులు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావేద్ నటించిన ఒక ఫేక్ అరెస్ట్ వీడియో. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన పోలీసులు కాదు. పోలీస్ దుస్తులు ధరించి ఫేక్ అరెస్ట్ వీడియోలను చిత్రీకరించినందుకు గాను ముంబై పోలీసులు ఉర్ఫీ జావేద్ మరియు ఇతర సహనటులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోలని షేర్ చేస్తూ Economic Times వార్తా సంస్థ ఇటీవల ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పోలీసు దుస్తులను ఉపయోగిస్తూ ఫేక్ అరెస్ట్ వీడియోలను చిత్రీకరించినందుకు ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావేద్, ఇతర నటులపై ముంబై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు.
పోలీసు దుస్తులలో ఉన్న ఇద్దరు మహిళలు పొట్టి బట్టలు వేసుకున్నందుకు ఉర్ఫీ జావేద్‌ను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఒక వీడియోని రూపొంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసు దుస్తులు ధరించి ఫేక్ అరెస్ట్ వీడియోలను చిత్రీకరించినందుకు గాను ముంబై పోలీసులు ఉర్ఫీ జావేద్ మరియు ఇతర సహ నటులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
అంతేకాదు, ఉర్ఫీ జావేద్ రూపొంధించిన ఈ ఫేక్ అరెస్ట్ వీడియోకి సంబంధించి ముంబై పోలీసులు ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టారు. పోలీసు యూనిఫాంను దుర్వినియోగపరుస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఈ వీడియోని రూపొంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ముంబై పోలీసులు ఈ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
చివరగా, ఉర్ఫీ జావేద్ నటించిన ఒక ఫేక్ అరెస్ట్ వీడియోని మహారాష్ట్ర/యూపీ పోలీసులు పొట్టి బట్టలు వేసుకున్నందుకు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.