Fake News, Telugu
 

ఒక వ్యక్తి ట్రంప్‌ను కొట్టాడని చెప్తూ డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేజి పైన ప్రసంగం చేస్తుండగా, ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి తనను కొడుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పాపం ట్రంప్.. ఇలా అయిపోయింది చివరికి పరిస్థితి’ అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు సోషల్ మీద యూజర్లు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల ఒక బహిరంగ సభలో డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిని చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్ (నిజం): 12 మార్చి 2016న ఒహాయోలోని డేటన్‌లో జరిగిన ఒక డొనాల్డ్ ట్రంప్‌ ర్యాలీలో, థామస్ డిమాస్సిమో అనే వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంఘటనకు చెందిన వీడియోని డిజిటల్‌గా ఎడిట్ చేసి, వైరల్ వీడియోను తయారు చేశారు. ఒరిజినల్ వీడియోలో అతను ట్రంప్‌ను చెంపదెబ్బ కొట్టలేదు. కాబట్టి, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటెర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా 12 మే 2016న న్యూయార్క్ డైలీ న్యూస్, యూట్యూబులో అప్‌లోడ్ చేసిన వైరల్ వీడియో యొక్క ఒరిజినల్ వెర్షన్‌ మాకు లభించింది.

ఈ వీడియో టైటిల్ ప్రకారం, ఒక నిరసనకారుడు స్టేజ్ పైకి వస్తుండగా సీక్రెట్ సర్వీస్ వారు ట్రంప్‌ను కాపాడటానికి స్టేజీపైకి దూసుకెళ్లిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. దీనిబట్టి, ఈ వీడియోకు, చెంపదెబ్బ కొడుతున్న ఒక వ్యక్తి దృశ్యాలను డిజిటల్‌గా జోడించి, వైరల్ వీడియోని ఎడిట్ చేశారని మనకు అర్థం అవుతుంది. ఈ సభ యొక్క వివిధ కెమెరా యాంగిల్స్‌ను చూడగా, ఈ విషయం మాకు మరింత స్పష్టం అయింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన వార్తా కథనాల ప్రకారం, (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఇది 12 మార్చి 2016న ఒహియోలోని డేటన్‌లో జరిగిన డొనాల్డ్ ట్రంప్‌ ర్యాలీలో జరిగింది. ర్యాలీ జరుగుతుండగా, థామస్ డిమాస్సిమో అనే వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మధ్యలో జోక్యం చేసుకుని ట్రంప్ చుట్టూ రక్షణగా నుంచున్నారు. ఇలా ప్రవర్తించినందుకు డిమాస్సిమోను పోలీసులు అరెస్టు చేశారు.

వైరల్ వీడియో, అసలు వీడియోలలోని దృశ్యాలను పక్కపక్కనే పెట్టి పోల్చి చూస్తే, ట్రంప్ ర్యాలీలో జరిగిన సంఘటనకు చెందిన ఫుటేజీని డిజిటల్‌గా ఎడిట్ చేసి వైరల్ వీడియోని తయారు చేశారని మనకు స్పష్టం అవుతుంది.

చివరగా, ఒక వ్యక్తి ట్రంప్‌ను కొట్టిన నిజమైన సంఘటనకు చెందిన దృశ్యాలని చెప్తూ, ఒక డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll