భూమి మీద ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ విడిచిపెట్టే ఏకైక ప్రాణి ఆవు మాత్రమేనని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భూమి మీద ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ విడిచిపెట్టే ఏకైక ప్రాణి ఆవు.
ఫాక్ట్: ఆవు కూడా మనుషులు, ఇతర జంతువుల లాగానే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. కేవలం చెట్లు, సముద్రపు ఆల్గే మాత్రమే కార్బన్ డయాక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చగలవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, మనిషితో సహా ఇతర జంతువులలో, చెట్లలో శ్వాసకోశ వ్యవస్థ (Respiratory system) ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. సాధారణ పరిస్థితులలో భూ వాతావరణంలోని గాలిలో ~78-79% నైట్రోజన్, ~20-21% ఆక్సిజన్, ~1% కార్బన్ డయాక్సైడ్ ఇంకా ఇతర వాయువులు ఉంటాయి.

జంతువులు (మనుషులతో సహా) శ్వాస తీసుకున్నప్పుడు ఈ వాయువులు అన్నీ ఊపిరి తిత్తులలోకి ప్రవేశిస్తాయి. అక్కడ ఆక్సిజన్ రక్తంలో కలిసి కణజాలం(Tissue) వద్దకు చేరుకుంటుంది. ఈ ఆక్సిజన్ శరీరంలోని గ్లూకోజ్ తో కలిసి శరీరానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడిన నీటిని కణాలు ఉపయోగించుకుంటాయి లేదా విసర్జిస్తాయి. ఇదే ప్రక్రియలో ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్ రక్తం ద్వారా ఊపిరితిత్తులకి చేరి శ్వాస విడిచినప్పుడు బయటకు వెళ్తుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్వాస తీసుకున్నప్పుడు అందులో ఉండే ఆక్సిజన్ మొత్తాన్ని ఊపిరి తిత్తులు గ్రహించలేవు. కేవలం ~25% మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా ఆక్సిజన్ శ్వాస విడిచినప్పుడు నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ తో పాటు బయటకు వెళ్లిపోతుంది. ఇది అన్ని జంతువులలో సాధారణంగా జరిగే ప్రక్రియ.

ఇక చెట్లు (సముద్రంలోని ఆల్గేతో సహా) విషయానికి వస్తే, కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) ద్వారా గ్లూకోజ్ తయారవుతుంది. ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియలో కొంత కార్బన్ డయాక్సైడ్ కూడా విడుదల చేసి నప్పటికీ, మొత్తంగా చూస్తే చెట్లు ఆక్సిజన్ ని ఎక్కువ విడుదల చేస్తాయి.

ఇక ఆవు విషయానికి వస్తే, ఆవు కూడా ఇతర జంతువుల లాగానే శ్వాస తీసుకొని అందులోని ఆక్సిజన్ సహాయంతో శరీరంలోని గ్లూకోజ్ ని శక్తిగా మార్చుకుంటుంది. మొత్తంగా చూస్తే, ఆవు ఇతర జంతువులు, మనిషి లాగానే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుందని ఈ ఆధారాల ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే, వివిధ దేశాలలో, అనేక రకాల ఆవులపై జరిపిన అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం, ఎక్కడా కూడా ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే ఇస్తుందని నిరూపించబడలేదు.

అలాగే, గతంలో కూడా ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే ఇస్తుందని పలువురు వ్యాఖ్యానించగా, జంతు శాస్త్ర నిపుణులు ఈ వ్యాఖ్యలు అశాస్త్రీయం అని ఖండించారు.
చివరిగా, ఆవు కూడా మనుషులు, ఇతర జంతువుల లాగానే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది.