Fake News, Telugu
 

1893లో చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఒరిజినల్ వీడియో అంటూ స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన సినిమా క్లిప్ షేర్ చేస్తున్నారు

0

1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన పార్లమెంటులో స్వామి వివేకానంద ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియో అని చెప్తూ పలు పోస్టులు(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని  దృశ్యాలు స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన ‘వివేకానంద బై వివేకానంద’ అనే సినిమా లోనివి.ఈ వీడియోను ‘శ్రీ రామకృష్ణ మఠం చెన్నై’ వారు యూట్యూబ్‌లో 04 అక్టోబర్ 2018న అప్‌లోడ్ చేసారు. అలాగే స్వామి వివేకానందకు సంబంధించి ఎటువంటి వాయిస్ క్లిప్స్ అందుబాటులో లేవని బేలూరు మఠం జనరల్ సెక్రటరీ స్వామి సువీరానంద 11 సెప్టెంబర్ 2020న యూట్యూబ్ వీడియోలో స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మేము ముందుగా వైరల్ వీడియో గురించి మరింత సమచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 04 అక్టోబర్ 2018న ‘శ్రీ రామకృష్ణ మఠం చెన్నై’ వారు యూట్యూబ్‌లో “వివేకానంద బై వివేకానంద| పూర్తి సినిమా | జీవిత చరిత్ర | ఇంగ్లీష్ | అధికారిక ” .( ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం) అనే శీర్షికతో అప్‌లోడ్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 13:34 వద్ద మొదలై, టైంస్టాంప్ 13:54 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. దీన్ని బట్టి ఈ సినిమాలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి షేర్ చేస్తున్నారు అని నిర్థారించవచ్చు.

ఈ క్రమంలోనే ‘ది హిందూ’ 07 సెప్టెంబర్ 2012న, స్వామి వివేకానంద యొక్క చికాగో ప్రసంగం రికార్డ్ చేయబడలేదని బేలూరు మఠం స్పష్టం చేసింది అని తెలుపుతూ ప్రచురించిన వార్త కథనం లభించింది. అలాగే, 11 సెప్టెంబర్ 2020న బేలూరు మఠం వారు తమ అధికారిక యూట్యూబ్‌ ఛానల్ ‘రామకృష్ణ మఠం & రామకృష్ణ మిషన్, బేలూరు మఠం’లో “స్వామి వివేకానంద వాయిస్ రికార్డింగ్ : స్వామి సువీరానంద”  అనే శీర్షికతో అప్‌లోడ్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోలో, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో ప్రసంగాలను రికార్డ్ చేయడానికి ఎటువంటి ఏర్పాటు లేదని, స్వామి వివేకానంద చికాగో సమావేశంలో మాట్లాడిన ఆడియో క్లిప్, వీడియో అంటూ ఇంటర్నెట్‌లో తప్పుగా షేర్ చేస్తున్నారని, స్వామి వివేకానంద సంబంధించి ఎటువంటి వాయిస్ క్లిప్స్ అందుబాటులో లేవని స్వామి సువీరానంద స్పష్టం చేసారు. 11 సెప్టెంబర్ 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన పార్లమెంటులో స్వామి వివేకానంద ప్రసంగాన్ని బేలూరు మఠం తమ వెబ్సైట్లో పొందుపరిచింది.(ఇక్కడ). ఈ వైరల్ వీడియో క్లిప్ యొక్క పూర్తి సినిమాను కూడా బేలూరు మఠం తమ వెబ్సైట్లో పొందుపరిచింది.(ఇక్కడ).

చివరగా,1893లో చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియో అంటూ స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన సినిమా దృశ్యాలు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll