ఒక రోడ్డుపై రెండు గుంపులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగింది అని, దేశంలో మెజారిటీగా ఉండి కూడా హిందువులు ముస్లింల చేత తన్నులు తింటున్నారు అని అర్థం వచ్చేలా ‘సంభాల్‌లో కస్టమర్లకు సత్కారం చేస్తోన్న పండ్ల వ్యాపారులు.. కస్టమర్లు ఎవరో తెలుసుగా..! చెక్కులర్ గాళ్ళకి హలాల్ చేస్తూన్న సొంత తండ్రులు…’ అని అంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌ల్లో ముస్లిం పండ్ల వ్యాపారులు హిందువులను కొడుతున్న వీడియో
నిజం(ఫ్యాక్ట్): ఈ సంఘటన నిజంగానే సంభాల్‌లో జరిగింది. కానీ ఈ ఘర్షణలో పాల్గొన్న ఇరు వర్గాల వారు హిందువులు అని సంబాల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) అనుజ్ కుమార్ తోమర్ మాకు(ఫ్యాక్ట్లీకి)చెప్పారు. అదే విషయాన్నీ వారి X హేండిల్ ద్వారా కూడా చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా ఈ సంఘటనపై ప్రచురించబడిన అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి. ఈ కథనాల ప్రకారం, వైరల్ వీడియోలో కనిపిస్తున్న సంఘటన సంభాల్‌లోని జంతా పెట్రోల్ పంప్ దగ్గర 21 మార్చి 2025న జరిగింది.

ఒక బస్సులో పూర్ణగిరి మాత దర్శనాకికి వెళ్తున్న కొందరు భక్తులు, సంభాల్‌లోని జంతా పెట్రోల్ పంప్ దగ్గర పండ్లు కొనుక్కుందాం అని ఆగారు. అయితే ఈ సమయంలో భక్తులు, పండ్లు అమ్మే వ్యక్తి మధ్య ఒక వాగ్వాదం మొదలైంది. అది చివరికి రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు లాఠీలతో, కర్రలతో కొట్టుకునే దాకా చేరుకుంది.

అయితే ఈ వార్తా కథనాల్లో పండ్ల వ్యాపారులు ముస్లింలు అని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే, ఈ ఘర్షణలో పాల్గొన్న ఆరుగురిపై సంబల్ సదర్ కోత్వాల్ పోలీస్వారు కేసు రిజిస్టర్ చేశారని Patrika.com వారు తమ కథనంలో పేర్కొన్నారు.

ఈ వీడియో గురించి ఇంటర్నెట్లో వెతుకుతున్న సమయంలో, ఇదే క్లెయిముతో ఉన్న ఒక ‘X’ పోస్టుకు సంబాల్ పోలీసు వారు స్పందిస్తూ (ఆర్కైవ్ లింక్), ఈ సంఘటనలలో గొడవపడిన రెండు వర్గాల వారు హిందువులు అని చెప్పారు (ఇప్పుడు ఒరిజినల్ పోస్టు డిలీట్ చేయబడింది).
ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మేము సంబాల్ కోట్వాలి పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) అనుజ్ కుమార్ తోమర్‌తో మాట్లాడాము. ఈ గొడవలో పాల్గొన్న రెండు వర్గాల వారు ఒకే మతానికి చెందిన వారు, వీళ్లందరూ హిందువులు అని ఆయన స్పష్టం చేశారు. పండ్లు అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తులు అందరూ హిందువులు అని ఆయన చెప్పారు.
చివరగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో రెండు హిందూ గుంపుల మధ్య జరిగిన ఒక ఘర్షణను, తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు.