Fake News, Telugu
 

1897 సారాఘరి యుద్ధంలో 22 సిక్కు యోధులు సుమారు 10,000 అఫ్గాన్‌ సైన్యంతో సుమారు ఏడు గంటలు పోరాడి చనిపోయారు

0

‘కొన్ని సంవత్సరాల కిందట 21 మంది సిక్కు యోధులు 12 వేల అఫ్గాన్‌ ముష్కరులను ఓడించారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘కొన్ని సంవత్సరాల కిందట 21 మంది సిక్కు యోధులు 12 వేల అఫ్గాన్‌ ముష్కరులను ఓడించారు.’

ఫాక్ట్ (నిజం): 12 సెప్టెంబర్ 1897న, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, 36 సిక్కు రెజిమెంట్‌కు చెందిన 22 మంది సిక్కు సైనికులు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న సారాఘరి కోట వద్ద సుమారు 10,000 మంది అఫ్గాన్‌ తెగలకు చెందిన సైనికులతో పోరాడారు. హవిల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని 22 మంది సైనికులు శత్రువులకు లొంగిపోకుండా, సుమారు ఏడు గంటలు పోరాడి చనిపోయారు. ఈ యుద్ధం స్మారక చిహ్నాలు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. పంజాబ్ రాష్ట్ర 5వ తరగతి పుస్తకంలో కూడా దీని గురుంచి ఉంది. పూర్తి విషయం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.

12 సెప్టెంబర్ 1897న, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, 36 సిక్కు రెజిమెంట్‌కు చెందిన 22 మంది సిక్కు సైనికులు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న సారాఘరి కోట వద్ద సుమారు 10,000 మంది అఫ్గాన్‌ తెగలకు చెందిన సైనికులతో పోరాడారు. మొన్న సెప్టెంబర్ 12కి ఈ యుద్ధం జరిగి 124 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ NTV ఈ యుద్ధం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. పోస్టులో చెప్తున్న విషయం ఈ కథనం నుండి సేకరించిందే.

ఐతే పోస్టులో మరియు వార్తా కథనంలో చెప్తునట్టు ఈ యుద్దంలో 22 సిక్కులు అఫ్గాన్‌ ముష్కరులను ఓడించలేదు. శత్రువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి లొంగిపోకుండా, హవిల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని 22 మంది సైనికులు సుమారు ఏడు గంటలు పోరాడి వందల మంది అఫ్గాన్‌ సైన్యాన్ని చంపేశారు. ఈ పోరాటంలో ఆ 22 మంది సిక్కు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత అఫ్గాన్‌ తెగలకు చెందిన సైన్యం ఆ కోటని ఆక్రమించుకుంది.

ఈ 22 మంది సైనికుల జ్ఞాపకార్ధం పంజాబ్ లోని ఫెరోజ్పూర్ లో ఒక స్మారక గురుద్వారని నిర్మించారు. అమృత్‌సర్ లో కూడా ఒక స్మారక గురుద్వారని నిర్మించారు.

2017లో సారాఘరి యుద్ధం జరిగి 120 సంవత్సరాలు అయిన సందర్భంలో పంజాబ్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు యొక్క పాఠ్యంశాల్లో ఈ యుద్ధం గురించి ప్రచురిస్తామని అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన నవజ్యోత్ సింగ్ సిద్దు అన్నారు. ఈ ప్రకటనకి అనుగుణంగా పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PSEB) క్లాస్ – 5 పంజాబీ పాఠ్యపుస్తకంలో ఈ యుద్ధం గురించి ఒక పద్యాన్ని చేర్చినట్టు ఈ కథనం ప్రకారం తెలుస్తుంది.

చివరగా, 1897లో జరిగిన సారాఘరి యుద్ధంలో 22 సిక్కు యోధులు సుమారు 10000 అఫ్గాన్‌ సైన్యంతో సుమారు ఏడు గంటలు పోరాడి చనిపోయారు.

Share.

About Author

Comments are closed.

scroll