Fake News, Telugu
 

2019 వీడియోని RBI రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తరువాత కారు టైరులో పట్టుబడిన నోట్ల కట్టల దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కారు టైరులో రూ. 2000 నోట్ల కట్టలు, నల్లధనం బయటపడిన ఇటీవలి దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించడంతో ఈ నల్లధనం బయటపడిందని కొని వార్తా సంస్థలు ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు RBI ప్రకటించిన తరువాత కారు టైర్లలో రూ. 2000 నోట్ల కట్టలు పట్టుబడిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2019లో కర్ణాటకలో ఒక కారు టైరులో ఆదాయ పన్ను శాఖ అధికారులు(ఐటి) రూ.2.3 కోట్లు విలువ గల రూ. 2000 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగళూరు నుండి శివమొగ్గకు డబ్బు తరలిస్తున్నారని సమాచారం అందడంతో, ఐటి అధికారులు తనిఖీ జరిపి డబ్బు రవాణా చేస్తున్న కారుని పట్టుకొని, టైర్లో దాచి పెట్టిన డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. RBI ఇటీవల రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత ఈ డబ్బుని అధికారులు పట్టుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ ‘TOI సమయం’ వార్తా సంస్థ 21 ఏప్రిల్ 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం సమీపంలో ఐటి అధికారులు ఓ కారులో జరిపిన సోదాలలో భారీ డబ్బు పట్టుబడిందంటూ వీడియోని షేర్ చేస్తు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది.

ఈ ఘటనకు సంబంధించి 2019లో పబ్లిష్ అయిన పలు వార్తా ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగళూరు నుండి శివమొగ్గకు డబ్బు తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఐటి అధికారులు తనిఖీ జరిపి డబ్బు రవాణా చేస్తున్న కారుని పట్టుకొన్నట్టు తెలిసింది. పట్టుబడిన కారులోని టైరులో రూ.2.3 కోట్లు విలువ గల రూ. 2000 నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, RBI రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తరువాత పట్టుబడిన నల్లధనం దృశ్యాలను ఈ వీడియో చూపించడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2019 వీడియోని RBI రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత కారు టైరులో పట్టుబడిన రూ. 2000 నోట్ల కట్టలు దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll