Fake News, Telugu
 

2019 ఫోటోని లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణ/ కర్ణాటకలో ప్రదర్శించిన బ్యానర్ అని షేర్ చేస్తున్నారు

0

లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణలో ప్రదర్శించిన బ్యానర్ యొక్క చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఇస్లాం టోపీ ధరించిన ఒక వ్యక్తి, చీర ధరించిన స్త్రీతో కలిసి దిగిన ఫోటోని ఈ బ్యానర్ చూపిస్తుంది. ఈ ఫోటోని కర్ణాటకలో ఇటీవల తీసినట్టు మరికొందరు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణ/కర్ణాటకలో ప్రదర్శించిన బ్యానర్ యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): 2019లో రంజాన్ పండగ సందర్భంగా CMR షాపింగ్ మాల్ వారు తెలంగాణలో ప్రదర్శించిన ఒక బిల్ బోర్డుని ఈ ఫోటో చూపిస్తుంది. రంజాన్ షాపింగ్ క్యాంపైన్‌లో భాగంగా తాము ప్రదర్శించిన బ్యానర్ వలన జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, తాము అన్ని మతాలను, కులాలను గౌరవిస్తామని, తాము ప్రదర్శించిన బ్యానర్లను వెంటనే తీసివేసినట్టు CMR షాపింగ్ మాల్ తెలంగాణ వారు 2019 మే నెలలోనే ప్రకటన విడుదల చేశారు. పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది, కర్ణాటకకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోని కనీసం 2019 జూన్ నెల నుండి పలు న్యూస్ పేజీలు మరియు యూసర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. రంజాన్ క్యాంపైన్‌ పేరుతో CMR షాపింగ్ మాల్ ప్రదర్శించిన ఈ బిల్ బోర్డుని వెంటనే తీసేయాలని గోషామహల్ MLA రాజా సింగ్ డిమాండ్ చేసినట్టు వీడియోని షేర్ చేస్తూ ఈ యూసర్లు తెలిపారు. పోస్టులో షేర్ చేసిన బ్యానర్ ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే, బ్యానర్ చివరిలో, తెలంగాణలోని వివిధ CMR షాపింగ్ మాల్స్‌ బ్రాంచుల పేర్లను రాసి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పాట్ని సెంటర్, మల్కాజ్‌గిరి,  సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో CMR షాపింగ్ మాల్స్‌ బ్రాంచులున్నట్టు ఈ బ్యానర్‌పై స్పష్టంగా రాశారు.  

ఈ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంబంధిత పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ బ్యానరుకు సంబంధించి CMR షాపింగ్ మాల్ 31 మే 2019 నాడు ఇచ్చిన ప్రకటన దొరికింది. తాము ప్రదర్శించిన హోర్డింగ్ వలన జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, తాము ఎలాంటి మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ బ్యానర్ పెట్టలేదని, తాము అన్ని మతాలను, కులాలను గౌరవిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, తాము ప్రదర్శించిన బ్యానర్లను తీసివేసినట్టు CMR షాపింగ్ మాల్ ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.

CMR షాపింగ్ మాల్ ఈ బ్యానరుకు సంబంధించి తెలుగులో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ బ్యానరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ CMR షాపింగ్ మాల్  వారు కూడా స్పందించారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని, కర్ణాటకకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2019 ఫోటోని లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణ/కర్ణాటకలో ప్రదర్శించిన బ్యానర్ చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll