Fake News, Telugu
 

2018 వీడియోని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా ముందు ఒప్పుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ ఓటమిని ముందుగానే ఒప్పుకున్న రేవంత్ రెడ్డి”, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మీడియా సమక్షంగా ఒప్పుకున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. “ఏదేమైన రాష్ట్ర ప్రజలు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టిఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫలితాలు ఎట్లున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యల మీద భాద్యతాయుతంగా పనిచేస్తాం” అని రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. 30 నవంబర్ 2023 నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పూర్తై, 03 డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఒడిపోతుందని రేవంత్ రెడ్డి మీడియా ముందు ఒప్పుకున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి ఓడిపోయిన తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని YOYO TV ఛానెల్ 11 డిసెంబర్ 2018 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి ఓడిపోయిన తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుందని, ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యల మీద భాద్యతాయుతంగా పనిచేస్తామనీ రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు. ఈ వీడియోని మరికొన్ని వార్తా సంస్థలు కూడా పబ్లిష్ చేశాయి.

30 నవంబర్ 2023 నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పూర్తైన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టంగా తెలిపాయని, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్‌కు 25 సీట్లకు మించి రావని రేవంత్ రెడ్డి ఎన్నికల తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఒడిపోనుందని రేవంత్ రెడ్డి ఎక్కడా ఒప్పుకోలేదు.

చివరగా, 2018 వీడియోని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి మీడియా ముందు ఒప్పుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll