వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమని మరియు ఎలాంటి ఆంక్షలు విధించేది లేదని తెలంగాణ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. గణేష్ నిమజ్జనానికి కావాలిసిన అన్ని ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమని మరియు ఎలాంటి ఆంక్షలు విధించేది లేదని తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 2016 జులై నెలలో పబ్లిష్ చేసింది. వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోలేమని, నగర అభివృద్ధి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు, గణేష్ చతుర్థి ఉత్సవ నిర్వాహకులు వినాయక విగ్రహాలను 15 అడుగుల ఎత్తుకి మించి ఉండకుండా చూసుకోవాలని సూచించింది. 2021 మరియు 2022లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలలో కూడా వినాయక విగ్రహాల ఎత్తుకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఎటువంటి నిర్ధిష్ట నియమాలను జారీ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అని రాసి ఉంది. ఈ ఫోటోకి సంబంధించిన సమాచారం కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సోషల్ మీడియా పేజీలలో వెతికితే, ఈ ఫోటోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 2016 జులై నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.
2016 జులై నెలలో తెలంగాణ హైకోర్టు గణేష్ చతుర్థి ఉత్సవాలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ పోస్టులో తెలిపారు. వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోలేమని, నగర అభివృద్ధి, మెట్రో పనులను, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు, గణేష్ చతుర్థి ఉత్సవ నిర్వాహకులు వినాయక విగ్రహాలను 15 అడుగుల ఎత్తుకి మించి ఉండకుండా చూసుకోవాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2016 జులై నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
2021 మరియు 2022లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో కేవలం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) ఉపయోగించి తయారుచేసిన విగ్రహాలను హుస్సైన్ సాగర్ మరియు హైదరాబాద్ నగరంలోని ఇతర సరస్సులలో నిమజ్జనం చేయడానికి నిషేధించింది. పర్యావరణంపై ప్రభావం చూపకుండా ఉండటానికి తక్కువ ఎత్తు మరియు పర్యావరణ అనుకూల విగ్రహాల వినియోగాలని ప్రోత్సహించాలని తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలలో తెలిపింది. కానీ, వినాయక విగ్రహాల ఎత్తుకి సంబంధించి నిర్ధిష్ట నియామాలేవీ తెలంగాణ హైకోర్టు తమ ఈ ఆదేశాలలో తెలుపలేదు.
చివరగా, 2016 ఫోటోని తెలంగాణ హైకోర్టు వినాయక విగ్రహల ఎత్తుకి సంబంధించి ఎటువంటి జోక్యం చేసుకోబోమని ఇటీవల స్పష్టం చేసినట్టుగా షేర్ చేస్తున్నారు.