Fake News, Telugu
 

మే 2025లో ఎన్ఐఏ ఢిల్లీలో సూసైడ్ బాంబర్‌ని అరెస్టు చేసిందంటూ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 2010 నాటి ఫోటోని షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసుల సహాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మే 2025లో ఢిల్లీలోని సీలంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దాడులు నిర్వహించి 16 మంది ఉగ్రవాదుల అరెస్టు చేసి, వారి నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ దాడులలో పట్టుబడ్డ సూసైడ్ బాంబర్ ఫోటో అని చెప్తూ శరీరం చుట్టూ పేలుడు పదార్థాలను కలిగి ఉన్న ఒక వ్యక్తి ఫోటోని కూడా ఈ పోస్టుతో పాటుగా షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a person wearing a vest  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: మే 2025లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడ్డ సూసైడ్ బాంబర్ యొక్క ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో ఆఫనిస్తాన్లో 2010లో పట్టుబడ్డ ఒక సూసైడ్ బాంబర్‌కి సంబంధించినది. అలాగే మే 2025లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇటువంటి దాడులను చేసినట్లు అధికారిక సమాచారం లేదు. అయితే వైరల్ పోస్టులో పేర్కొన్న వివరాలు 26 డిసెంబర్ 2018న ఢిల్లీ, యూపీలలో ఎన్ఐఏ చేసిన దాడికి సంబంధించినవి. ఈ దాడిలో హర్కత్-ఉల్-హర్బ్-ఎ-ఇస్లాం అనే ఉగ్రవాద ముఠాకి చెందిన పది మంది సభ్యులను అరెస్టు చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ పోస్టులో చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల ఎన్ఐఏ ఇటువంటి దాడులని ఏమైనా చేసిందా అని ఎన్ఐఏ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాల్లో వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. అయితే, డిసెంబర్ 2018లో ఎన్ఐఏ ఢిల్లీ, యూపీ పరిసర ప్రాంతాల్లో ఈ తరహా దాడులని చేసిందని ప్రముఖ వార్తా సంస్థలు అప్పట్లో రిపోర్ట్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) చేశాయి.

వీటి ఆధారంగా ‘ఐసిస్ మాడ్యూల్ ‘హర్కత్-ఉల్-హర్బ్-ఎ-ఇస్లాం’ పై ఎన్ఐఏ దాడులు’  అనే పేరుతో 26 డిసెంబర్ 2018న ఎన్ఐఏ విడుదల చేసిన మీడియా ప్రకటన మాకు లభించింది. దీని ప్రకారం, 26 డిసెంబర్ 2018న ఢిల్లీ, యూపీ పరిసర ప్రాంతాల్లో ఐసిస్ ప్రేరిపిత ‘హర్కత్-ఉల్-హర్బ్-ఎ-ఇస్లాం’ అనే ఉగ్రవాద ముఠా సభ్యులపై ఢిల్లీ, యూపీ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. ఈ ముఠాకి ప్రధాన సూత్రధారిగా ఉన్న ముఫ్తీ మొహమ్మద్ సుహైల్ తో పాటు పది మందిని అరెస్టు చేశారు. మరికొందరిని అనుమానితులని విచారించారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులు, బుల్లెట్లు, ఒక రాకెట్ లాంచర్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. 2019లో ఈ కేసుకి సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేయగా, మే 2025 నాటికి ఈ కేసు విచారణ దశలో ఉన్నట్లు ఎన్ఐఏ వెబ్సైట్ పేర్కొంది.

ఇక వైరల్ పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో 2010 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోటో ఆఫనిస్తాన్లో పట్టుబడ్డ ఒక సూసైడ్ బాంబర్‌కి సంబంధించినదిగా 2010లో కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి.

A screenshot of a person with a beard  AI-generated content may be incorrect.

చివరిగా, మే 2025లో ఎన్ఐఏ ఢిల్లీలో సూసైడ్ బాంబర్‌ని అరెస్టు చేసిందంటూ సంబంధంలేని ఫోటోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll