‘వోక్స్ వాగన్ పోలో కారు చిన్నదే, కాని చాలా బలమైనది’, అంటూ షేర్ చేస్తున్న ఒక ప్రకటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వోక్స్ వాగన్ కారులో వచ్చిన ఒక ఉగ్రవాది, తన దేహం పై ఉన్న బాంబుని పేల్చగా, అది వోల్క్స్ వాగన్ కారులో మాత్రమే పేలిన దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి సంబంధించి వోక్స్ వాగన్ సంస్థ నిర్మించిన ప్రకటన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో పదిహేనేళ్ళ క్రితం నిర్మించిన వోక్స్ వాగన్ స్పూఫ్ ప్రకటన అని తెలిసింది. ఈ వీడియోని లీ ఫోర్డ్ మరియు డన్ బ్రూక్స్ అనే లండన్ కి చెందిన ఇద్దరు క్రియేటివ్ డిజైనర్లు నిర్మించినట్టు తెలిసింది. ఈ ప్రకటన తమది కాదు అని వోక్స్ వాగన్ సంస్థ 2005లోనే స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఈ వీడియోకి సంబంధించి ‘The Guardian’ న్యూస్ వెబ్ సైట్ ‘23 జనవరి 2005’ లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈ వీడియో 2005 లో నిర్మించిన వోక్స్ వాగన్ స్పూఫ్ ప్రకటన అని అందులో తెలిపారు. ఈ వీడియోని లీ ఫోర్డ్ మరియు డన్ బ్రూక్స్ అనే లండన్ కి చెందిన ఇద్దరు క్రియేటివ్ డిజైనర్లు నిర్మించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ స్పూఫ్ ప్రకటన వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవ్వడంతో, వోక్స్ వాగన్ సంస్థ ఈ ప్రకటన తాము నిర్మించినది కాదు అని స్పష్టం చేసింది. అలాగే, ఈ వీడియోని నిర్మించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు ఆర్టికల్ లో తెలిపారు.
ఈ వీడియో సృష్టించిన లీ ఫోర్డ్ మరియు డన్ బ్రూక్స్ వోక్స్ వాగన్ సంస్థకు క్షమాపణ చెప్పడానికి ఒప్పుకోవడంతో, వారిపై వోక్స్ వాగన్ సంస్థ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ వీడియోకి సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పదిహేనేళ్ళ క్రితం స్పూఫ్ వీడియోని, ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి సంబంధించి వోక్స్ వాగన్ సంస్థ నిర్మించిన ప్రకటన వీడియో అని ఇప్పుడు మళ్ళి షేర్ చేస్తున్నారు.