మహిళలపై జరిగే దాడుల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉంది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మహిళలపై జరిగే దాడుల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉంది.
ఫాక్ట్ (నిజం): నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (NCRB) సమాచారం ప్రకారం 2019వ సంవత్సరానికి గాను మహిళలపై జరిగే నేరాల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం 18,394 రిపోర్ట్ అయిన కేసులతో దేశంలోని రాష్ట్రాల్లో 9వ స్థానంలో ఉండగా, రేట్ అఫ్ క్రైమ్ పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ 99.3 క్రైమ్ రేట్ తో దేశంలో 5వ స్థానంలో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (NCRB) సమాచారం ప్రకారం 2019వ సంవత్సరం కి గాను మొత్తం భారత దేశంలో మహిళలపై జరిగిన దాడుల (crime against women) సంఖ్య 3,91,601 అందులో తెలంగాణలో నమోదైన సంఖ్య 18,394 అనగా మొత్తం భారత దేశంలో నమోదైన దానిలో 4.5 శాతం. ఐతే దేశంలోని అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 59,853 దాడి సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి. రాజస్థాన్ (41,550) మరియు మహారాష్ట్ర (37,144) ఉత్తరప్రదేశ్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఐతే కేవలం మహిళలపై జరిగిన దాడుల సంఖ్యని పరిగలోకి తీసుకుంటే తెలంగాణ దేశంలో 9వ స్థానంలో ఉంది. తెలంగాణలో 2017, 2018తో పోల్చుకుంటే 2019లో మహిళపై జరిగే నేరాలు పెరిగాయి. 2017లో తెలంగాణాలో 17,521 సంఘటనలు రిపోర్ట్ కాగా, 2018లో 16,027 సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి.
ఐతే రాష్ట్రాల్లో జనాభాలో వ్యత్యాసం వల్ల కేవలం మహిళలపై జరిగే దాడుల సంఖ్య ఆధారంగా పోల్చడం ద్వారా వాస్తవికత తెలియదు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ ఎక్కువ జనాభాగల రాష్ట్రం గనుక అక్కడ మహిళలపై జరిగే నేరాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే మహిళలపై జరిగే నేరాల వాస్తవికతను తెలుసుకోవడానికి ‘రేట్ అఫ్ క్రైమ్’ (అనగా ప్రతి లక్ష మందికి నమోదయ్యే నేరాల సంఖ్య) ని పరిగణలోకి తీసుకోవడం వల్ల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవచ్చు. 2019వ సంవత్సరంలో తెలంగాణలో మహిళలపై జరిగే నేరాల రేట్ 99.3గా ఉంది, ఈ రేట్ ప్రకారం తెలంగాణ దేశంలోని రాష్ట్రాల్లో 5వ స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం 177.8 క్రైమ్ రేట్ తో మహిళలపై జరిగే నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది, దీని తరవాత రాజస్థాన్ 110.4 క్రైమ్ రేట్ తో రెండో స్థానంలో ఉండగా హర్యానా 108.5 క్రైమ్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. దీన్నిబట్టి మహిళలపై జరిగే నేరాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉందనడంలో వాస్తవం లేదు.
చివరగా, మహిళలపై జరిగే నేరాలలో రేట్ అఫ్ క్రైమ్ లో తెలంగాణ ఐదవ స్థానంలో ఉండగా, అస్సాం, రాజస్థాన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.