పాకిస్తాన్ పార్లమెంట్‌లోకి గాడిద వచ్చిందని చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్ పార్లమెంట్‌లోకి ఒక గాడిద వెళ్లిన నిజమైన సంఘటనకు చెందిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక AI-జనరేటెడ్ వీడియో. పాకిస్తాన్ పార్లమెంట్‌లోకి గాడిద వెళ్లిన సంఘటనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ముందుగా అసలు పాకిస్తాన్ పార్లమెంటులోకి వైరల్ వీడియోలో కనిపిస్తున్న విధంగా గాడిద వచ్చిందని చెప్తూ ఏవైనా వార్తా కథనాలు ఉన్నాయా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. అయితే, ఈ సెర్చ్ ద్వారా మాకు ఈ విషయానికి రుజువుగా ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.
ఇక ఈ వీడియోను మేము సరిగ్గా పరిశీలించగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలు/ఇమేజీలలో ఉండే అవకతవకలు మాకు ఈ వీడియోలో కనిపించాయి. ఈ వీడియోలో పలు చోట్ల మనుషులకు చేతులు ఉండవు, కొందరి ముఖాలు వింతగా కనిపిస్తాయి, ఒక వ్యక్తి ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తే, మరో ఫ్రేమ్‌లో మాయం అయిపోతాడు, ఒక చోట కుర్చీ అకస్మాత్తుగా గాలిలో తేలినట్లు కనబడుతుంది. ఇవన్నీ చూసాక, ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసినది అయి ఉండవచ్చు అనే అనుమానం కలిగింది.

దీనిని వెరిఫై చేయడానికి వైరల్ వీడియోను మేము హైవ్, డీప్‌ఫేక్-ఓ-మీటర్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి చెక్ చూసాము. ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసింది అని అవి గుర్తించాయి.


ఇక వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించిన ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, ఇదే వీడియో మాకు @arabianspeed1 అనే టిక్-టాక్ అకౌంటులో లభించింది. ఈ పోస్టు యొక్క వివరణలో, ‘Contains AI-generated media’ అనే ట్యాగ్ ఉంది. అంటే ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసినదని దీని అర్థం.

చివరగా, పాకిస్తాన్ పార్లమెంటులోకి ఒక గాడిద వెళ్లిన సంఘటనకు చెందిన దృశ్యాలని చెప్పి ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.

