పోలీసులు తీసుకెళ్తుండగా ఓ యువకుడు నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో ఉన్న యువకుడి పేరు లవ్‌ప్రీత్ అని, అతని సోదరిపై అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన అక్బర్ అనే వ్యక్తిని చంపినందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు రాస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: లవ్‌ప్రీత్ సోదరిపై అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన అక్బర్ అనే వ్యక్తిని చంపినందుకు లవప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న వీడియో ఇది.
ఫాక్ట్ (నిజం): 2015లో లవ్‌ప్రీత్ సోదరిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పేరు ఓంకర్ సింగ్, అక్బర్ కాదు. ఇతను కోవిడ్-19 సమయంలో 2020 మొదట్లో బెయిల్‌పై విడుదలయ్యాడు, 28 ఆగస్టు 2024న లవప్రీత్ సింగ్ చేత హత్య చేయబడ్డాడు. కానీ, వైరల్ వీడియో 10 ఏప్రిల్ 2024 నుండే సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీని ద్వారా వైరల్ వీడియోలో ఉన్నది లవప్రీత్ సింగ్ కాదు అని స్పష్టం అవుతుంది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, దీనికి సంబంధించిన మీడియా రిపోర్టు మరియు ఓంకార్ సింగ్ హత్య గురించి X ప్లాట్‌ఫారమ్‌లో కపుర్తలా పోలీసుల స్టేట్‌మెంట్‌ని మేము కనుగొన్నాము. ఈ నివేదిక ప్రకారం, 2015లో లవ్‌ప్రీత్ సోదరిపై అత్యాచారానికి పాల్పడిన ఓంకర్ సింగ్, కోవిడ్-19 సమయంలో 2020 ప్రారంభంలో బెయిల్‌పై విడుదలయ్యాడు, 28 ఆగస్టు 2024న హత్య చేయబడ్డాడు. ఈ నేరానికి సంబంధించి మజహద్‌పూర్ గ్రామానికి చెందిన ఆకాష్‌దీప్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, బిషన్‌పూర్ జట్టన్ గ్రామానికి చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అని మీడియా రిపోర్ట్ చేసింది.
తదుపరి 04 సెప్టెంబర్ 2024న లవ్‌ప్రీత్ సింగ్ ను అరెస్టు చేసినట్లు పేర్కొన్న అదే సంఘటనకు సంబంధించిన మరో మీడియా కథనం లభించింది.
ఇకపోతే వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేమ్స్ ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ “Addu Defaulter”కి దారితీసింది. ఈ పేజీలో 10 ఏప్రిల్ 2024న వైరల్ వీడియోతో సరిపోలే వీడియోలను (ఇక్కడ మరియు ఇక్కడ) పోస్ట్ చేసినట్లు తెలుసుకున్నాం. అయితే, ఇది ఎక్కడ, ఏ సందర్భాల్లో జరిగిన సంఘటన అన్న విషయాలు తెలియలేదు. కాకపోతే 28 ఆగస్టు 2024న ఓంకార్ సింగ్ హత్యకు ముందు నుండే ఈ వీడియో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో ఉన్నది ఓంకార్ ను హత్య చేసిన లవ్ ప్రీత్ సింగ్ అయ్యే అవకాశం లేదు.
చివరిగా, “తన సోదరిపై అత్యాచారం చేసిన వ్యక్తిని చంపిన తర్వాత లవ్‌ప్రీత్ సింగ్ నవ్వుతున్న వీడియో” అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.