Fake News, Telugu
 

ఫోటోలో బ్రిటిష్ వారి చేతిలో కొరడా దెబ్బలు తింటుంది ‘భగత్ సింగ్’ కాదు

0

అప్పట్లో వార్తాపత్రికలు ప్రచురించిన భగత్ సింగ్ ఫోటో అని చెప్తూ ఒక వ్యక్తి బ్రిటీష్ వారి చేతిలో కొరడా దెబ్బలు తింటున్న ఫోటోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బ్రిటిష్ వారి చేతిలో అతి భయంకరమైన కొరడా దెబ్బలు తింటున్న భగత్ సింగ్.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది భగత్ సింగ్ కాదు. పోస్ట్ లోని ఫోటోని కాసుర్ రైల్వే స్టేషన్ లో తీసినట్టు 1920 లో ప్రచురించిన ఒక పుస్తకం లో చూడవచ్చు. 1919-20 సమయంలో భగత్ సింగ్ లాహోర్ లోని డీ.ఏ.వీ స్కూల్ లో చదువుతుండే వాడు మరియు అప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు మాత్రమే. అంతేకాదు, ప్రభుత్వం ప్రచురించిన డాక్యుమెంటుల్లో కూడా 1920 కంటే ముందు భగత్ సింగ్ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ వారి చేతిలో కొరడా దెబ్బలు తినట్టు లేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో ఉన్న ఒక ట్వీట్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ట్వీట్ చూస్తే పోస్ట్ లోని ఫోటో 1920 లో ‘Benjamin Horniman’ ప్రచురించిన పుస్తకం నుండి తీసుకున్నట్టు ఉంటుంది. కావున ఆ బుక్ గురించి వెతకగా, ఆ పుస్తకం పేరు ‘Amritsar and Our Duty to India’ అని తెలుస్తుంది (ఆ పుస్తకం యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చదవచ్చు). పోస్ట్ లోని ఫోటోని ఆ పుస్తకం లో 120 పేజీ లో చూడవచ్చు. ఆ ఫోటో కింద ‘Another picture of an Indian tied to a ladder at Kasur railway station being flogged’ అని  రాసి ఉంది. ఫోటోలో ఉంది భగత్ సింగ్ అని ఆ పుస్తకంలో ఎక్కడా కూడా లేదు. 

పోస్ట్ లో ఫోటో ఒక వార్తాపత్రిక లో వచ్చినట్టు చెప్తున్నారు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో ఈ ఫోటో పత్రిక లో వచ్చినట్టు ఉన్న ఒక ఫోటో కూడా దొరుకుంతుంది. అయితే ఆ ఫోటో చూస్తే వార్తా పత్రిక పేరు కానీ, ప్రచురించిన తేదీ కానీ ఉండవు. ఫోటో కింద మాత్రం ‘జైలు లో బ్రిటిష్ వారి చేతిలో కొరడా దెబ్బలు తింటున్న భగత్ సింగ్’ అని ఉంటుంది. ఆ ఫోటో తీసింది రైల్వే స్టేషన్ లో అని, జైలు లో కాదని, ఇంతకుముందే చూసాము. అంతే కాదు, 1920 కంటే ముందు భగత్ సింగ్ జైలు లో ఉన్నట్టుగానీ, కొరడా దెబ్బలు తినట్టు గానీ ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కావున, వార్తా పత్రిక ఒకవేళ ఫోటోలో ఉన్నది భగత్ సింగ్ అని ప్రచురించినా, అది తప్పు.

1919 లో జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు భగత్ సింగ్ కి 12 ఏళ్ళు అని, తను అప్పుడు లాహోర్ లోని డీ.ఏ.వీ స్కూల్ లో చదువుతుండే వాడని ‘Bhagat Singh: Select Speeches And Writings’ పుస్తకం లో చదవచ్చు (ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చదవచ్చు). అయితే, జలియన్ వాలా బాగ్ సంఘటన తర్వాత భగత్ సింగ్ అక్కడికి వెళ్లి రక్తం చిందిన పిడికెడు మట్టి తనతో తీసుకొని వచ్చాడని ఆ పుస్తకం లో ఉంటది. కానీ, తనను 1920 కంటే ముందు బ్రిటీష్ వారు అరెస్ట్ చేసారని కానీ, కొరడా దెబ్బలు కొట్టారని కానీ ఎక్కడా కూడా లేదు. అంతే కాదు, 2019 లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘Dictionary of Martyrs’ లో కూడా 1920-22 సమయం నుండి భగత్ సింగ్ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నట్టు ఉంటుంది.

చివరగా, ఫోటోలో బ్రిటిష్ వారి చేతిలో కొరడా దెబ్బలు తింటుంది ‘భగత్ సింగ్’ కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll