మోడీ ఒక ఇంటర్వ్యూ లో తను 1988 లోనే డిజిటల్ కెమెరా వాడాను అని చెప్పినప్పటి నుండి సోషల్ మీడియా లో ఆ వీడియో వైరల్ అవుతుంది. కొందరు తనకు అబద్ధం కూడా చెప్పడం సరిగ్గా రాదు అని పోస్టులు పెడుతుంటే, మరికొందరు రాజీవ్ గాంధీ 1983 లోనే డిజిటల్ కెమెరా వాడినప్పుడు 1988 లో మోడీ వాడినట్టు చెప్పడంలో తప్పేముంది అని ఒక ఫోటో తో కూడిన పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): 1983 లోనే రాజీవ్ గాంధీ డిజిటల్ కెమెరా వాడినట్టు ఫోటోలో చూడొచ్చు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో రాజీవ్ గాంధీ చేతిలో ఉన్నది డిజిటల్ కెమెరా కాదు. అది టేప్ క్యాసెట్ల మీద నడిచే వీడియో కెమెరా. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికినప్పుడు, ఆ ఫోటో నిజంగానే పోస్ట్ లో చెప్పినట్టుగా 1983 లో తీసారని ఇండియా టుడే ఆర్టికల్ లో ఉంటుంది. అలానే ‘Rajiv Gandhi with camera’ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే అలాంటిందే ఇంకో ఫుల్ ఫోటో వస్తుంది.
ఫోటో లో తను పట్టుకున్న కెమెరామీద ‘JVC’ అని రాసి ఉన్నట్టుగా చూడవచ్చు. కాబట్టి గూగుల్ లో ‘JVC Vintage Camera’ అని వెతికితే, సెర్చ్ రిజల్ట్స్ లో రాజీవ్ గాంధీ పట్టుకున్న కెమెరా వస్తుంది. ఆ ఫోటో కింద దాని మోడల్ నెంబర్ (JVC GX-88 E) అని రాసి ఉంటుంది.
మోడల్ నెంబర్ తెలిసింది కాబట్టి ఆ నెంబర్ తో గూగుల్ లో “jvc gx-88e video camera” అని వెతికితే, సెర్చ్ రిజల్ట్స్ లో ఆ కెమెరా యొక్క యూసర్ మాన్యువల్ ఉన్న e-bay వెబ్ సైట్ లింక్ వస్తుంది. దాంట్లో కెమెరా కి సంబంధించిన వివరాలు ఉంటాయి. దాని ప్రకారం రాజీవ్ గాంధీ చేతిలో ఉన్న కెమెరా టేప్ల మీద నడుస్తుందని తెలుస్తుంది. అది డిజిటల్ కెమెరా కాదు.
చివరగా, ఫోటోలో రాజీవ్ గాంధీ చేతిలో ఉన్నది డిజిటల్ కెమెరా కాదు.
ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?