మోడీ పాలనలో అత్యధికంగా సైనికులు ప్రాణాలు కోల్పోయారంటు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): గత ముపై ఏళ్ళలో ఎన్నడు లేని విధంగా మోడీ పాలనలో దేశంలో అత్యధికంగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఫాక్ట్ (నిజం): ముపై ఏళ్ళ సమాచారం (డేటా) పబ్లిక్ గా అందుబాటులో లేదు. కానీ గత పదిహేనేళ్ల డేటా చూస్తే మోడీ హయాంలో అంతకముందు కంటే తక్కువ సైనికులు చనిపోయారని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం1249 జవాన్లు వివిధ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందారు. అలానే 4 ఏళ్ల మోడీ ప్రభుత్వం లో 378 జవాన్లు మృతి చెందారు. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ మొతాన్ని మరియు 4 ఏళ్ళ మోడీ ప్రభుత్వ మొతాన్ని పోల్చలేము. కానీ ట్రెండ్ ని చూస్తే మృతుల సంఖ్య పెరుగుతుందా లేదా అని ఒక అంచనా వస్తుంది. 2004 నుండి ప్రతి సంవత్సరం మృతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది కానీ ఈ మధ్య కొంచం పెరిగింది. కానీ పోస్ట్ లో చెప్పినట్టుగా మోడీ పాలనలో అంతకముందు కంటే ఎక్కువ సైనికులు చనిపోలేదు. గత పదిహేనేళ్ళ లోనే తక్కువ గా ఉన్నందున ముపై ఏళ్ళు చూసినప్పుడు మోడీ పాలనలో అత్యధిక సైనికుల మరణాలు ఉండలేవు.చివరగా, మోడీ పాలనలో దేశంలో అత్యధికంగా సైనికులు ప్రాణాలు కోల్పోలేదు.