సోషల్ మీడియా లో ఓటింగ్ కి సంబంధించి కొంత సమాచారం గత కొన్ని రోజులుగా చాలా షేర్ అవుతుంది. ఆ సమాచారం లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా) 1: ఓటర్ లిస్టులో మీ పేరు, ఓటు లేకుంటే మీ ఆధార్ కాని ఓటరు గుర్తింపు కార్డు చూపించి “సెక్షన్ 49 A క్రింద” “ఛాలెంజ్ ఓటు” అడిగి ఓటు హక్కు వినియోగించుకోండి.
ఫాక్ట్ (నిజం): ‘THE CONDUCT OF ELECTIONS RULES, 1961’ లో సెక్షన్ 49A ఈవీఎం డిజైన్ కి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఓటర్ లిస్ట్ లో పేరు లేకుంటే ఓటు వేయడం సాధ్యం కాదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
ఓటింగ్ మరియు ఎలక్షన్స్ లో పాటించాల్సిన రూల్స్ THE CONDUCT OF ELECTIONS RULES, 1961 లో ఉంటాయి. అందులో 49A సెక్షన్ చూస్తే ఈవీఎం మెషిన్ డిజైన్ గురించి ఉంటింది. ఎక్కడ కూడా ‘ఛాలెంజ్ ఓటు’ గురించి ఉండదు. ‘ఛాలెంజ్ ఓటు’ కి సంబంధించి Handbook for Presiding Officers లో సమాచారం దొరుకుతుంది. ఓటర్ యొక్క గుర్తింపు పై పోలింగ్ ఏజెంట్ కి అనుమానాలు ఉంటే ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు.
అరుదయిన సందర్భాలలో తప్పితే ఓటు వేయాలంటే ఓటర్ లిస్ట్ లో పేరు ఉండటం తప్పనిసరి. కావున “ఛాలెంజ్ ఓటు” మరియు “సెక్షన్ 49 A” గురించి షేర్ అవుతున్న సమాచారం లో నిజం లేదు.
క్లెయిమ్ (దావా) 2: మీరు వెళ్ళేటప్పటికే మీ ఓటు వేరే వాళ్ళు వేసినట్టు అయితే “టెండర్ ఓటు” అడిగి ఓటు హక్కు వినియోగించుకోండి
ఫాక్ట్ (నిజం): ‘THE CONDUCT OF ELECTIONS RULES, 1961’ రూల్స్ లో సెక్షన్ 49P ప్రకారం ‘టెండర్ ఓటు’ అడిగి బాలట్ పేపర్ ద్వారా టెండర్ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది నిజం
‘THE CONDUCT OF ELECTIONS RULES, 1961’ రూల్స్ లో సెక్షన్ 49P ప్రకారం మనకంటే ముందే మన ఓటు ఎవరయినా వేసి ఉంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే బాలట్ పేపర్ ద్వారా టెండర్ ఓటు వేసే అవకాశం కలిపిస్తారు. కావున ‘టెండర్ ఓటు’ గురించి పోస్ట్ లో చెప్పింది నిజం.
క్లెయిమ్ (దావా) 3: 14%శాతం దాటి టెండర్ ఓట్లు పోలయిన బూత్ లో మరలా పోలింగ్ నిర్వహిస్తారు.
ఫాక్ట్ (నిజం): టెండర్ ఓట్లు అన్ని ఓట్లతో పాటు లెక్కించరు. హైకోర్ట్ ఉత్తరువులు ఇచ్చినప్పుడు మాత్రమే లెక్కిస్తారు. కావున పోస్ట్ లో చెప్పింది నిజం కాదు
‘THE CONDUCT OF ELECTIONS RULES, 1961’ రూల్స్ లో సెక్షన్ 56 ప్రకారం అన్ని ఓట్లు లెక్కించినప్పుడు, వాటిల్లో టెండర్ ఓట్లు పరిగణలోకి తీసుకోరు. 14% దాటి టెండర్ ఓట్లు పోలయిన బూత్ లో మరలా పోలింగ్ నిర్వహించే సమాచారం రూల్స్ లో ఎక్కడ లేదు. హైకోర్ట్ ఉత్తరువులు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ టెండర్ ఓట్లను లెక్కిస్తారు. కావున టెండర్ ఓట్ల లెక్కింపు గురించి పోస్ట్ లో చెప్పింది నిజం కాదు.
1 Comment
thank you sir for clarification