Fake News, Telugu
 

కొన్ని సంబంధం లేని ఫోటోలు పెట్టి ‘హైద్రాబాద్ హోటల్లలో కుక్కలను కోసి బిర్యాని తయారు చేస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెల్లడి’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

‘హైదరబాద్, కరీంనగర్, నిజామాబాద్ వివిధ నగరాల్లోని హోటల్స్ లో అధికారులు తనికి చేయగా, నమ్మలేని నిజాలు బయటపడ్డాయి, కుక్కలను కోసి బిర్యానీ తాయారు చేస్తున్నారు, ఆయిల్,డాల్డాకు బదులుగా జంతువుల ఎముకల నుండి తీసిన ఆయిల్ ను కూడా వాడుతున్నారు, దయచేసి ఈ విషయాన్ని అందరికి తెలిసేవరకు షేర్ చేయండి’ అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్టులో ఉన్న ఫోటోలు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పోలీసులు ఆ నగరాల్లోని హోటల్లను కల్తీ మాంసం మరియు ఇతర ఆహార పదార్ధాల గురించి తనిఖీ చేస్తున్నప్పుడు తీసినవి.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన ఫోటోలో కనిపిస్తున్న “The Ashoka Hotel” కోల్‌కతాకి చెందినది. 2018లో కుక్క మాంసం తో ఆహారం తయారు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ వారు మరియు అక్కడి పోలీసులు ఆ హోటల్ లో తనిఖీలు నిర్వహించినప్పటిది. ఆ ఫోటోలో ఉన్నదీ హైదరాబాద్ లోని హోటల్ కాదు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.      

పోస్టులో ఉన్న ఫోటోలను ఒక్కోదాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, “The Ashoka Hotel” అని ఉన్న ఫోటో, కుక్క మాంసం తో ఆహారం తయారు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ వారు మరియు అక్కడి పోలీసులు ఆ హోటల్ లో తనిఖీలు నిర్వహించినప్పటిదని తెలిసింది. ఆ హోటల్ తనిఖీ గురించి మరింత సమాచారం కోసం వెతికినప్పుడు,  ఆ సందర్భంలో తీసిన ఒక యూట్యూబ్ వీడియో కూడా లభించింది. ఆ తనిఖీల్లో 100కేజీల పాడైపోయాయిన మాంసం లభించిందని “Times of India” కథనం ద్వారా తెలిసింది.

పోస్టులో కుక్కల సమూహంతో ఉన్న ఫోటో “dreamstime.com” అనే వెబ్సైట్ లో థాయిలాండ్ ట్నమ్ కబేళా కి పంపడానికి నిలువ ఉంచిన 1000 కి పైగా కుక్కలను థాయ్ పోలీసులు కాపాడిన కథనం లో లభించింది.

పోస్టులో కుక్క చర్మం తీసి, ఒక తాడుతో దాన్ని వేలాడతీసి ఉన్న ఫోటో ఇరాన్ కి చెందిన ‘Fars News Agency’ వారు ఆ దేశంలోని ‘మశ్శద్’ అనే ప్రాంతంలో కుక్కల మాంసంతో ‘సాసేజ్’ తయారు చేస్తున్నారా అనే అంశం మీద  2015లో రాసిన కథనంలో లభించింది. కానీ, ఆ కథనంలో ఆ ఫోటోకి సంబంధించిన స్పష్టమైన సమాచారం ఏమీ లేదు.

పోలీసు అధికారి ఆహారాన్ని పరిశీలిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటో గురించి వెతికినప్పుడు ఎక్కడా కూడా స్పష్టమైన సమాచారం లభించలేదు. చివరగా, కొన్ని అసంబంధిత ఫోటోలు పెట్టి ‘హైద్రాబాద్ హోటల్లలో కుక్కలను కోసి బిర్యాని తయారు చేస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెల్లడి’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll