Fake News, Telugu
 

ఆ ట్వీట్ NSA అజిత్ ధోవల్ చేయలేదు. అసలు తనకి అధికారిక ట్విట్టర్ ఖాతానే లేదు

0

పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్ చేస్తున్న బెదిరింపులు మరియు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆపుకోలేక NSA సలహాదారు అజిత్ దోవల్ వ్యంగ్యంగా ఓ ట్వీటు పెట్టాడు అంటూ ఫేస్బుక్ లో కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో పెట్టిన పోస్టు లో ఈ విధంగా ఉంది- ‘వాస్తవానికి చాలా కీలకాంశాల్లో సైలెంటుగా, తెరవెనుక, రహస్యంగా పనిచేసుకుంటూ వెళ్లే అజిత్ ధోవల్ బహిరంగంగా పెద్దగా స్పందించడు… కానీ పాకిస్థాన్ బెదిరింపులు, నిర్ణయాలపై ఆపుకోలేక వ్యంగ్యంగా ఓ ట్వీటు కొట్టాడు… నిజంగా ఇండియాకు నష్టం లేదా..?’. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

అజిత్ దోవల్ పెట్టినట్లుగా చెప్తున్న ట్వీట్ క్రింద చూడవచ్చు. దీని అర్థం ‘పాకిస్తాన్ భారత్‌తో అన్ని ద్వైపాక్షిక ట్రేడ్‌లను రద్దు చేసింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం, దాని విలువ విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషనల్ పోస్ట్ కోసం తీసుకున్న ధరతో సమానంగా ఉంటుంది. చాలా విచారంగా, ఈ భారీ నష్టం నుండి మనం ఎలా కోలుకుంటామో ’.

క్లెయిమ్ : ‘పాకిస్తాన్ భారత్‌తో అన్ని ద్వైపాక్షిక ట్రేడ్‌లను రద్దు చేసింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం, దాని విలువ విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషనల్ పోస్ట్ కోసం తీసుకున్న ధరతో సమానంగా ఉంటుంది. చాలా విచారంగా, ఈ భారీ నష్టం నుండి మనం ఎలా కోలుకుంటాము’ అని అజిత్ ధోవల్ ట్వీట్ చేశాడు. .

ఫాక్ట్ (నిజం): ఆ ట్వీట్ అజిత్ ధోవల్ పేరు మీద ఉన్న ఒక అభిమానుల ట్విట్టర్ అకౌంట్ లోది . అసలు అజిత్ ధోవల్ కి అధికారికంగా ట్విట్టర్ లో అకౌంట్ లేదు. కావున పోస్ట్ లో అజిత్ ధోవల్ ట్వీట్ చేసినట్టు చెప్పేది అబద్ధం.    

ఆ ట్వీట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ యొక్క వివరణ (డిస్క్రిప్షన్ ) చూసినప్పుడు, అందులో “National Security Advisor fc.” అని ఉంది. fc అనే అక్షరాలు సాధారణంగా ఫ్యాన్ క్లబ్ (అభిమానుల సంఘం) కి వాడుకగా ఉపయోగిస్తారు. దాన్ని బట్టి, అది అజిత్ ధోవల్ పేరు మీద ఉన్న ఒక అభిమానుల ట్విట్టర్ అకౌంట్ అని తెలుసుకోవచ్చు. ఒకరి పేరు మీద అభిమానులు ట్విట్టర్ అకౌంట్ వాడుకకు సంబంధించి ట్విట్టర్ సంస్థ అధికారిక పాలసీ ఇక్కడ చూడొచ్చు.

ఆ ట్విట్టర్ అకౌంట్ లోని ఇతర ట్వీట్లను చూడగా, అందులో పెట్టే ట్వీట్ లు వ్యంగ్యంగా ఉన్నట్లుగా ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అసలు అజిత్ ధోవల్ కి అధికారికంగా ట్విట్టర్ లో అకౌంట్ ఉందా అనే విషయం తెలుసుకోవడానికి ‘Factly’ వారు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు, వారు అసలు తనకి ఎటువంటి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదని, ఆ ట్వీట్ కి అజిత్ ధోవల్ కి సంబంధం లేదని తెలిపారు.

చివరగా, ఆ ట్వీట్ అజిత్ ధోవల్ చేసినట్టుగా చెప్తున్న ట్వీట్ తాను చేయలేదు. అందుకే ఈ ప్రచారం తప్పు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll