ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్లన క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది.
ఫాక్ట్(నిజం): అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ రీసెర్చ్, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఇతర సంస్థల క్యాన్సర్ పై చేసిన పరిశోధనల రిపోర్ట్స్ పరిశీలించగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్లన క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ క్లెయిమ్ గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్ లో వెతకగా, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.
అలాగే క్యాన్సర్ గురించి మరింత సమాచారం కోసం వెతకగా, అమెరికాకు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ప్రకారం క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి. ట్రిలియన్ల కణాలతో రూపొందించబడిన మానవ శరీరంలో దాదాపు ఎక్కడైనా క్యాన్సర్ ప్రారంభమవవచ్చ. సాధారణంగా, మానవ కణాలు కణ విభజన అనే ప్రక్రియ ద్వారా శరీరానికి అవసరమైన కొత్త కణాలను ఏర్పరుస్తాయి. కణాలు పాతబడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, అవి చనిపోయి కొత్త కణాలు వాటి స్థానంలో వస్తాయి. కొన్నిసార్లు శరీరానికి అవసరం లేకున్నా కణ విభజన అసాధారణమైన సంఖ్యలో జరిగి కణితులగా ఏర్పడతాయి. ఈ కణితులు క్యాన్సర్ కావచ్చు లేదా క్యాన్సర్ కాకపోవచ్చు.
క్యాన్సర్ కణితులు సమీపంలోని ఇతర కణజాలాలలోకి వ్యాప్తి చెంది దాడి చేస్తాయి. అలాగే శరీరంలోని సుదూర భాగాలకు ప్రయాణించవచ్చు. క్యాన్సర్ కణితులు ప్రాణాంతక కణితులు. కానీ సాధారణ కణితులు సమీపంలోని కణజాలాలలోకి వ్యాపించవు లేదా దాడి చేయవు, తొలగించబడినప్పుడు సాధారణంగా ఇవి తిరిగి పెరగవు. అయితే క్యాన్సర్ కణితులు మాత్రం మళ్ళీ పెరుగుతాయి. సాధారణమైన లేదా క్యాన్సర్ కాని కణితులు కొన్నిసార్లు చాలా పెద్దవిగా ఉండీ తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక వేళ మెదడులో ఈ కణితులు ఏర్పడితే ప్రాణాంతకం కావచ్చు. క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. సాధారణంగా క్యాన్సర్లు ఏర్పడే అవయవాలు లేదా కణజాలాల ఆధారంగా వాటిని పిలుస్తారు. ఉదాహరణకు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తులలో మొదలవుతుంది మరియు మెదడు క్యాన్సర్ మెదడులో మొదలవుతుంది.
Webmd , నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ప్రకారం క్యాన్సర్ రావడానికి అనేక కారణలు ఉన్నాయి, అందులో కొన్ని ముఖ్యమైనవి, ధూమపానం చేయడం లేదా పొగాకు ఉత్పతులు ఉపయోగించడం వలన నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా తల మరియు మెడ క్యాన్సర్ , కాలేయ క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడి నుండి లేదా రేడియేషన్ థెరపీ నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు(UV Rays) చర్మ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఆస్బెస్టాస్ ఉపయోగం వల్లన ఊపిరితిత్తుల క్యాన్సర్ , స్వరపేటిక క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది . ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్లన కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఫ్రిజ్ ఉపయోగించే ప్రజలలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 30శాతం తక్కువగా ఉందని తెలిపింది. అయితే, ఈ ఫలితాలు మిగితా పరిశోధన ఫలితాలతో వైరుధ్యంగా ఉన్నాయి అని తమ రిపోర్టులో నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ పేర్కొన్నది. ఈ సమాచారం ఆధారంగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్లన క్యాన్సర్ వస్తుంది చెప్పడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని నిర్థారించవచ్చు.
క్యాన్సర్ కలిగించే కారకాల గురించి తెలిపే మరిన్ని రిపోర్ట్స్ ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. క్యాన్సర్ సంబంధించిన ఇతర సమచారం ఇక్కడ చూడవచ్చు. క్యాన్సర్ గురించిన అపోహల సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్లన క్యాన్సర్ వస్తుంది చెప్పడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు.