Fake News, Telugu
 

2024లో జైపూర్‌లోని అజ్మీర్ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధమైన దృశ్యాలను హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంగా షేర్ చేస్తున్నారు

0

“హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదానికి గురైన కారు దానికదే కదిలి పరుగులు పెట్టిన ఘటన” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సెప్టెంబర్ 2025లో హైదరాబాద్‌లోని ఒక ఫ్లైఓవర్‌పై కారు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న సంఘటన హైదరాబాద్‌లో జరగలేదు. ఈ సంఘటన 12 అక్టోబర్ 2024న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్డులోని సుదర్శన్‌పుర పులియా సమీపంలో ఉన్న ఎలివేటెడ్ రోడ్డు (ఫ్లైఓవర్)పై జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను అక్టోబర్ 2024లో పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తూ, ఈ సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగినట్లు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు అక్టోబర్ 2024లో ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 12 అక్టోబర్ 2024న మధ్యాహ్నం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్డులోని సుదర్శన్‌పుర పులియా సమీపంలో ఉన్న ఎలివేటెడ్ రోడ్డు (ఫ్లైఓవర్)పై జరిగింది. జితేందర్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా AC నుంచి పొగలు రావడం గమనించి, వెంటనే కారును పక్కకు ఆపి బానెట్ తెరిచి పరిశీలించారు. కానీ అప్పటికే మంటలు కారు అంతటా వ్యాపించాయి, మంటల్లో కారు హ్యాండ్ బ్రేక్ దెబ్బతిని కారు ప్రధాన ఫ్లైఓవర్పై నుండి నియంత్రణ లేకుండా ముందుకు కదిలింది. చివరకు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

తదుపరి మేము ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్‌లో కూడా జియోలొకేట్ చేశాము. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఎలివేటెడ్ అజ్మీర్ రోడ్.

చివరగా, ఈ వైరల్ వీడియో 12 అక్టోబర్ 2024న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఎలివేటెడ్ అజ్మీర్ రోడ్డు (ఫ్లైఓవర్)పై ఒక కారు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll