అమెరికాలోని అక్రమ వలసదారులని తిరిగి తమ స్వదేశాలకు పంపిస్తున్న నేపథ్యంలో అక్రమ వలసదారులుగా గుర్తించబడిన భారతీయుల చేతులకి, కాళ్ళకి బేడీలు వేసి తిరిగి భారత్ పంపిస్తున్నారాని చెప్తూ ఒక ఫోటో (ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: అమెరికాలోని భారతీయ వలసదారులని కాళ్ళకి, చేతులని బేడీలు వేసి భారత్ తరలిస్తున్న ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటో 30 జనవరి 2025న అమెరికా నుంచి గ్వాటెమాలకు వెళ్తున్న గ్వాటెమాల దేశస్థులని చూపుతుంది. కానీ భారతీయ వలసదారులని తీసుకెళ్లిన మొదటి విమానం ఫిబ్రవరి 04న టెక్సాస్ లో బయలుదేరి ఫిబ్రవరి 05న అమృత్‌సర్ చేరుకుంది. అయితే, భారతీయ వలసదారులకు బేడీలు వేసి తరలించారా లేదా అనే విషయాన్ని మేము ధృవీకరించలేము. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోతో కూడిన ‘ది ఇండిపెండెంట్’ వార్తా కథనం లభించైంది. 30 జనవరి 2025న ప్రచురించబడిన ఈ కథనం ప్రకారం, అమెరికాలోని టెక్సాస్ నుంచి మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాల దేశానికి 30 జనవరి 2025న 80 మంది వలసదారులని తరలిస్తున్నారని పేర్కొంది. ఇందులో భారత వలస దారుల గురించి ప్రస్తావించలేదు.

ఈ ఫోటోని అసోసియేటెడ్ ప్రెస్ వారు తీసినదిగా ‘ది ఇండిపెండెంట్’ కథనంలో పేర్కొన్నారు. దీని ఆధారంగా అసోసియేటెడ్ ప్రెస్ వెబ్సైట్లో ఈ ఫోటో గురించి వెతకగా, ఈ ఫోటో 30 జనవరి 2025 నాడు టెక్సాస్ లోని ఎల్ పాసో నగరంలో తీసినదగా తెలిసింది. చేతులకి, కాళ్ళకి సంకెళ్ళతో గ్వాటెమాలకు తిరిగివెళ్లడానికి మిలిటరీ విమానంలో సిద్ధంగా ఉన్న వలసదారుల ఫోటో అంటూ వివరణలో పేర్కొన్నారు.

అయితే, మీడియా కథనాల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, 104 భారతీయ వలసదారులని తరలించిన మొదటి విమానం ఫిబ్రవరి 04న టెక్సాస్ లో బయలుదేరి ఫిబ్రవరి 05న అమృత్‌సర్ చేరుకుంది. అయితే, ఇతర దేశాల వలసదారుల మాదిరిగానే భారతీయ వలసదారులకు బేడీలు వేసి తరలించారా లేదా అనే విషయాన్ని మేము ధృవీకరించలేము. ఈ ఆర్టికల్ రాసే సమయానికి దీనికి సంబంధిత ఫోటోలు మాకు లభించలేదు. అయితే వైరల్ ఫోటో భారతీయ వలసదారులకు సంబంధించనది కాదని నిర్ధారించవచ్చు.
చివరిగా, చేతులని, కాళ్ళకి బేడీలు వేసినట్లు చూపుతున్న ఈ ఫోటో గ్వాటెమాల వలసదారులకి చెందినది, భారతీయులది కాదు.