ఒక రోడ్డు పక్కన కొందరు బుర్ఖా ధరించిన మహిళల నఖాబ్‌ను (ముసుగును) ఒక వ్యక్తి తీసి చూస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఆ మహిళలందిరి చేతులకు గొలుసులు వేసి ఉండటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ‘ఆ బురఖా తీసివేసి ధర చెప్పు…😩 దీన్ని కొనడానికి ఇష్టపడే కస్టమర్ ఎవరైనా ఉన్నారా లేదా? 😵💫 ..’ అని ఉన్న ఈ పోస్టు యొక్క వివరణ, మహిళలను కొనుక్కునే (కొనుగోలు చేసే) ఒక మార్కెట్ లాంటి ప్రదేశంలో ఈ వీడియోను చిత్రించారని సూచిస్తుంది. ఈ వీడియో ఇరాన్ దేశంలో తీసిందని, ఈ పోస్టు వివరణలో ఉంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఇరాన్‌లో స్త్రీలను కొనుగోలు చేసే ఒక మార్కెట్‌లో తీసిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో ఆర్యన్ రఫీక్ అనే కుర్దిష్ కళాకారిణి డైరెక్ట్ చేసిన ఒక ఆర్ట్ ప్రదర్శనను (drama) చూపిస్తుంది, ఇరాన్‌లో స్త్రీలను అమ్ముతున్న నిజమైన మార్కెట్‌ను కాదు. ఐసిస్ (ISIS) చేత కిడ్నాప్ చేయబడి, బానిసలుగా అమ్మబడిన మహిళల దుస్థితిని ఈ వీధి నాటకం చూపిస్తుంది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియోలో కనిపించే దృశ్యాలను పోలి ఉన్న వీడియో ఒకటి మాకు టిక్-టాక్‌లో లభించింది. ఇది ఆర్యన్ రఫీక్ అనే ఆర్టిస్ట్ యొక్క “The Unheard Screams Of The Ezidkhan Angel” అనే ఆర్ట్ పెర్ఫార్మన్స్ అని ఈ పోస్టు యొక్క వివరణలో ఉంది.

బెల్జియన్ పార్లమెంట్ సభ్యురాలు ధర్యా సఫాయి, ఇదే వీడియోను, ఐసిస్ నడుపుతున్న లైంగిక బానిసల (sex-slaves) మార్కెట్ దృశ్యాలని చెప్తూ మే 2023లో ‘X’లో షేర్ చేసినప్పుడు, అనేక మీడియా సంస్థలు తన ట్వీట్‌కు స్పందించి, ఈ వీడియో ఇరాక్‌లో ఐసిస్ ఉన్న సమయంలో మహిళల బానిసత్వాన్ని చూపిస్తూ చేసిన ఒక ప్రదర్శనకు చెందినదని చెప్పాయని మాకు తెలిసింది.
ఈ సమాచారాన్ని క్లూగా తీసుకొని, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆర్యన్ రఫీక్ యొక్క ఫేస్‌బుక్ పేజీ మాకు కనిపించింది. అందులో “The Unheard Screams Of The Ezidkhan Angels” కళా ప్రదర్శన (art performance/drama) గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ కనిపించింది. ఆర్యన్ రఫీక్ ఒక కుర్దిష్ కళాకారిణి. ఆమె 8 మార్చి 2023న చేసిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన “The Unheard Screams Of The Ezidkhan Angels” నాటకం యొక్క ప్రదర్శన ఇరాక్‌లో ఉన్న ఎర్బిల్ సిటాడెల్ సమీపంలోని ఎర్బిల్-పార్కి షార్ అనే ప్రదేశంలో జరగనుందని చెప్తూ, దీన్ని చూడడానికి ప్రజలకు ఆహ్వానం పలికారు.

ఈ వీడియో గురించి VRT న్యూస్‌తో ఆర్యన్ రఫీక్ మాట్లాడుతూ, ఈ వీడియో తను చేసిన ఒక కళా ప్రదర్శన (art performance/drama) అని ధృవీకరించారు. ఐసిస్ (ISIS) చేత కిడ్నాప్ చేయబడి, బానిసలుగా అమ్ముడుపోయిన మహిళల దుస్థితి గురించి చేసిన ఒక పెద్ద ప్రదర్శనకు సంబంధించిన ఒక చిన్న భాగమే ఈ వీడియో అని ఆర్యన్ రఫీక్ వారితో అన్నారు.

గతంలో ఇదే వీడియో సిరియాలో ఐసిస్(ISIS) వారు నడుపుతున్న ఒక స్లేవ్ మార్కెట్‌ను చూపిస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, ఆ క్లెయిమ్ తప్పు అని చెప్తూ ఫ్యాక్ట్‌లీ ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది.
చివరగా, ఇరాన్‌లో స్త్రీలను రోడ్డు పక్కన వేలం వేస్తున్న దృశ్యాలు అని చెప్తూ ఒక నాటక ప్రదర్శన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

