Fake News, Telugu
 

ఏప్రిల్‌ 2024లో మణిపూర్‌లో మైతీ మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకున్న దృశ్యాలను ఇటీవల మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

మణిపూర్‌లో రెండు ప్రధాన తెగలైన కుకీ (Kuki), మైతీ (Meitei) మధ్య మే 2023 నుండి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు (ఇక్కడ, ఇక్కడ). అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారనే విమర్శల నడుమ 09 ఫిబ్రవరి 2025న మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి సీఎం రాజీనామా చేశారు. దీంతో 13 ఫిబ్రవరి 2025న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో,“మణిపూర్ ఇప్పుడు రాష్ట్రపతి పాలనలో ఉంది..ఇలాంటి చిల్లర వ్యూహాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సైన్యానికి అన్నీ అధికారాలు ఉన్నాయి..అడ్డు తొలగక పోతే సింపుల్ గా తొక్కుకుంటూ పోతారు..కుకి మిలిటెంట్స్ దాక్కున్న గ్రామంలోనికి ప్రవేశించకుండా అడ్డం పడుకున్న మహిళలను చక్కగా తోసుకుంటూ వెళ్ళిపోయిన ఆర్మీ పైలట్ వాహనం” అని చెప్తున్న పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టులకు మద్దతుగా కొంతమంది మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తూ చేస్తున్నారు. ఈ వీడియోలో చూపిస్తున్న ఘటన ఇటీవల మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫిబ్రవరి 2025లో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కుకీ మిలిటెంట్స్ దాక్కున్న గ్రామంలోనికి ఆర్మీ ప్రవేశించకుండా కొంతమంది మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వీడియో ఏప్రిల్ 2024 నాటిది. 30 ఏప్రిల్ 2024న మైరా పైబిస్ (మండుతున్న కాగడా పట్టుకున్నది) అని పిలువబడే మైతీ సాంస్కృతిక ఉద్యమంలో భాగమైన మహిళా నిరసనకారులు, ఆర్మీ అదుపులోకి తీసుకున్న విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ సభ్యులను విడుదల చేయాలని, వారి ఆయుధాలను కూడా తిరిగి ఇవ్వాలని సైన్యాన్ని డిమాండ్ చేస్తూ మణిపూర్‌ బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి పోలీస్ స్టేషన్ వద్ద చేపట్టిన నిరసన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోపై ‘ISTV NEWS’ అనే  వాటర్‌మార్క్ ఉండటం మనం చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్‌లో వెతకగా, ఈ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియోను మణిపూర్ కేంద్రంగా పనిచేసే ISTV అనే అనే వార్తా ఛానెల్ వారి యూట్యూబ్‌ ఛానెల్ ISTV LIVEలో 30 ఏప్రిల్ 2024న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. దీన్ని బట్టి ఈ వీడియోలో చూపించే ఘటన ఇటీవలిది అనగా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగిన సంఘటన కాదని మనం నిర్ధారించవచ్చు.

తదుపరి ఈ వైరల్ వీడియోలో చూపించే సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ 01 మే 2024న ప్రచురించబడిన ‘నాగాలాండ్ పోస్ట్’ రిపోర్ట్ ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, వైరల్ వీడియోలో కనిపించే ఘటన 30 ఏప్రిల్ 2024న మణిపూర్‌ బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు ఇతర వార్త కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), 29 ఏప్రిల్ 2024న బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగలవై ప్రాంతంలో, భారత సైన్యంలోని 2వ మహర్ రెజిమెంట్ దళాలు పోలీసు యూనిఫాంలు ధరించి, అధునాతన ఆయుధాలతో రెండు జిప్సీ వాహనాల్లో ప్రయాణిస్తున్న 11 మంది సభ్యుల విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ (VDF) బృందాన్ని అడ్డుకుని, వారి నుండి 10 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 30 ఏప్రిల్ 2024న మైరా పైబిస్ (మండుతున్న కాగడా పట్టుకున్నది) అని పిలువబడే మైతీ సాంస్కృతిక ఉద్యమంలో భాగమైన మహిళా నిరసనకారులు, విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క పురుషులను విడుదల చేయాలని, ఆయుధాలను కూడా తిరిగి ఇవ్వాలని సైన్యాన్ని డిమాండ్ చేస్తూ కుంబి పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు చేశారు, అలాగే స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో ఆర్మీ దళాలు ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లకుండా ఓ పాడైన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టి మైరా పైబి మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అయితే ఆర్మీ కాన్వాయ్ వారిని తోసుకుంటూ ముందుకు సాగింది, ఈ ఘర్షణలో ఆర్మీ దళాలలు జనసమూహాన్ని చెదరగొట్టడానికి గాల్లోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం మణిపూర్‌లో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనా విధించడం ఇది 11వ సారి. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన చివరిసారి 02 జూన్‌ 2001న ప్రారంభమై 06 మార్చి 2002న ముగిసింది. 23 ఏళ్ల తర్వాత మణిపూర్‌లో మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు.
కేంద్రం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఆరు నెలల పాటు విధించవచ్చు. పార్లమెంటు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి, గరిష్టంగా మూడు సంవత్సరాల కాలానికి దీనిని పునరుద్ధరించవచ్చు. కానీ అలా పొడిగించిన ప్రతి సారీ పార్లమెంట్‌ ఆమోదం కావాలి. 2027 వరకు పదవీకాలం ఉన్న మణిపూర్‌ అసెంబ్లీని కేంద్రం రద్దు చేయలేదు. కానీ ‘సస్పెండ్‌ యానిమేషన్‌’లో ఉంచింది. దీని అర్థం రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా వీలు కల్పించడం (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, ఏప్రిల్‌ 2024లో మణిపూర్‌లో మైతీ మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకున్న దృశ్యాలను ఇటీవల మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll