ఢిల్లీ సంగం విహార్‌లో ఒక ముస్లిం వ్యక్తి హిందూ యువకుడిని కత్తితో పొడిచి చంపేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. దాడి తరువాత చుట్టుపక్కవారు నిందితుడిని పట్టుకొని కర్రలతో కొట్టినట్టూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ సంగం విహార్‌లో ఒక ముస్లిం హిందూ యువకుడిని కత్తితో పొడిచి చంపేసిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో దాడి చేసిన వ్యక్తి అలాగే, దాడికి గురైన వ్యక్తి ఇద్దరు ముస్లిం మతానికి చెందినవారే. తన దగ్గర తీసుకున్న రూ. 3000 అప్పును తిరిగి ఇవ్వలేదని షారూఖ్ అనే వ్యక్తి యూసఫ్ అలీపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ వీడియోలో దాడికి గురై చనిపోయిన వ్యక్తి హిందువు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని IANS వార్తా సంస్థ 03 ఆగస్టు 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రి పోలీస్ స్టేషన్ ఎదుట షారూఖ్ అనే వ్యక్తి రూ.3000 కోసం యూసఫ్ అలీ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు ఈ వీడియోలో తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వార్తా రిపోర్టులలో తెలిపిన సమాచారం ప్రకారం యూసఫ్ అలీ రెండు నెలల క్రితం సంగం విహార్‌లో నివసించే షారూఖ్ దగ్గర రూ.3000 అప్పు చేశాడు. యూసఫ్ అలీ అప్పుగా తీసుకున్న డబ్బుని తిరిగి చెల్లించకపోవడంతో, 02 ఆగస్టు 2023 నాడు, టిగ్రి పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల సమీపంలో, షారూఖ్ యూసఫ్‌పై కత్తితో దాడి చేసి అతన్ని చంపేసినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. యూసఫ్ అలీపై దాడి చేసిన తరువాత చుట్టుపక్కన ఉన్న వారు నిందితుడిని పట్టుకొని కొట్టారని, పోలీసులు వచ్చే సమయానికి ఇద్దరు కింద గాయాలతో పడి ఉన్నట్టు తెలిసింది. పోలీసులు నిందితుడు షారూఖ్‌ను చికిత్స తరువాత అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన మరింత స్పష్టత కోసం టిగ్రి పోలిస్ స్టేషన్ SHOను మేము ఫోనులో సంప్రధించాము. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి మరియు దాడి చేసిన వ్యక్తి ఇద్దరు ముస్లిం మతానికి చెందిన వారని, డబ్బులకు సంబంధించి జరిగిన ఘర్షంలో ఈ హత్య జరిగిందని, ఇందులో మతపరమైన కొణమేమి లేదని టిగ్రి పోలిస్ స్టేషన్ SHO మాకు తెలిపారు. ఈ కేసుకు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఢిల్లీ పోలీస్ వెబ్సైటులో అందుబాటులోకి పెట్టిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.
చివరగా, ఢిల్లీ సంగం విహార్‌లో రూ.3000 కోసం జరిగిన హత్యను మతపరమైన కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.